జమిలి ఎన్నికలు: బిజెపికి జైకొట్టిన కేసీఆర్, చంద్రబాబు నో

KCR for joint polls, writes to law panel
Highlights

కేంద్రం ప్రతిపాదించిన జమిలి ఎన్నికలకు కేసీఆర్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు కేసీఆర్ న్యాయ కమిషన్ కు ఓ లేఖ రాశారు. చంద్రబాబు మాత్రం జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు.

న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జమిలి ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జైకొట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. న్యాయ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ చౌహాన్‌ నేతృత్వంలో రెండో రోజు ఆదివారం ఢిల్లీలో అభిప్రాయ సేకరణ చేపట్టింది. 

జమిలి ఎన్నికలకు చంద్రశేఖరరావు సుముఖత వ్యక్తం చేశారు. టీడీపీ మాత్రం జమిలి ముసుగులో ముందస్తు ఎన్నికలకు సహకరించేది లేదని తేల్చి చెప్పింది. లోకసభకు ముందస్తు ఎన్నికలు వస్తే తాము ఎదుర్కుంటామని, కానీ శాసనసభకు ముందస్తు ఎన్నికలకు అంగీకరించబోమని చంద్రబాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

జమిలి ఎన్నికలకు సుముఖత వ్యక్తం చేస్తూ రెండు పేజీల లేఖను కేసీఆర్ న్యాయ కమిషన్‌కు రాశారు. ఈ లేఖను ఎంపీ వినోద్‌ కుమార్‌ అందజేశారు.జమిలి ప్రతిపాదనకు తమ పార్టీ మద్దతు తెలుపుతున్నదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ చెప్పారు. ఒకేసారి కాకుండా విడివిడిగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంవల్ల ప్రజా ధనం, సమయం వృథా అవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

2019లో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, అందువల్ల జమిలి ఎన్నికలతో నష్టమేమీ ఉండదన్నారు. మిగిలిన రాష్ట్రాలకు జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకునే టీఆర్‌ఎస్‌ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని ఆయన వివరించారు. దీన్ని ముందస్తు ఎన్నికలపై చర్చ అంటూ కొందరు అర్థం లేని వాదనకు తెరలేపారన్నారు.
 
తమ పార్టీ జమిలి ప్రతిపాదనను వ్యతిరేకిస్తోందని, ఇలాంటి ఒక ఆలోచన న్యాయ కమిషన్‌ చేయడం దురదృష్టకరమని డిఎంకె నేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇది సమాఖ్య విధానాన్ని దెబ్బ తీస్తుందని అన్నారు. సమాజ్‌వాది (ఎస్పీ) పార్టీ మాత్రం జమిలి ఎన్నికలకు తాము సిద్ధమని వెల్లడించింది. ఒక దేశం ఒకే ఎన్నిక విధానం 2019 నుంచే మొదలు పెట్టాలని ఆ పార్టీకి చెందిన రామ్‌గోపాల్‌ సూచించారు. 

ఎన్డీయేలో భాగస్వామి అయిన జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) కూడా ఒకేసారి ఎన్నికలకు తమ మద్దతు తెలిపింది. పార్టీకి చెందిన జాతీయ సమావేశం ఆదివారం ఢిల్లీలో జరగగా జమిలికి తామూ అనుకూలమనే నిర్ణయాన్ని పార్టీ వెల్లడించింది. 

జమిలి ఎన్నికల ప్రతిపాదనపై ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ తొలిరోజు హాజరు కాలేదు.  చాలా బలంగా తాము జమిలి విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెసు స్పష్టం చేసింది. వామపక్షాలు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అసలు జమిలి ఎన్నికల అంశం న్యాయ కమిషన్‌ పరిధిలోనే ఉండదని, పూర్తిగా పార్లమెంట్‌కే ఆ అధికారం ఉంటుందని తెలిపాయి.

loader