హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాట మాడుతోందని మండిపడ్డారు. 

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పిదాలపై సోషల్ మీడియాలో స్పందించిన విజయశాంతి  ఆగ్రహంతో రగిలిపోయారు. కాసుల కోసం కక్కుర్తిపడి ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించడానికి అర్హత లేని ఓ అనామక కంపెనీకి బాధ్యతలు అప్పజెప్పి అమాయక విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు. 

గ్లోబరీనా అనే సంస్థకు ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉందని చెప్పుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా గ్లోబరినా అనే సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారని దానికి ఇంటర్మీడియట్ బోర్డు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఈ అంశంపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నివేదికను సైతం పట్టించుకోకుండా ఎందుకు గ్లోబరీనా సంస్థపై మమకారం చూపారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థుల పరీక్షఫీజుల చెల్లింపు సందర్భంగా సాఫ్ట్ వేర్ లో తలెత్తిన సాంకేతిక లోపాలకు గ్లోబరీనా సంస్థ అనుభవరాహిత్యమే కారణమని నిపుణులు నిర్ధారించినప్పటకీ అదే సంస్థకు పరీక్షల నిర్వహణ బాధ్యతను అప్పగించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. 

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్ధుల పట్ల ఇంత ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా తమ నిర్లక్ష్యాన్ని కప్పిబుచ్చుకునేందుకు తెలంగాణ మంత్రులు సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

పేపర్ లీక్ ల వ్యవహారాన్ని కప్పిబుచ్చిన విధంగానే, ఇంటర్ బోర్డు పరీక్షల వైఫల్యాలను కూడా మసిపూసి, మారేడుకాయ చేయాలాని సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జరిగిన వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో రగిలిపోతున్నారని తెలిపారు. అధికారంతో కళ్లు మూసుకుపోయిన టీఆర్ఎస్ నేతలకు తగిన గుణపాఠం చెప్పేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారని విజయశాంతి స్పష్టం చేశారు.