కరీంనగర్ ఇసుక వ్యాపారం అంతా కెసిఆర్ కుటుంబం చేతిలోనే కెసిఆర్ కుటుంబ ఆదాయం రోజుకు కోటి అక్రమ ఇసుక దందాలపై గ్రీన్ కోర్ కు ఫిర్యాదు చేస్తా థర్డ్ డిగ్రీ బాధితులకు సర్కారే పరిహారం ఇవ్వాలి

తెలంగాణ సిఎం కెసిఆర్ కుటుంబంపై మరోసారి విరుచుకుపడ్డారు టిడిపి నేత రేవంత్ రెడ్డి. సిఎం కుటుంబ ఆదాయం రోజుకు కోటి ఉంటుందన్నారు. కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా మొత్తం సిఎం కెసిఆర్ కుటుంబం కనుసన్నల్లోనే నడుస్తుందని ఆరోపించారు రేవంత్. కరీంనగర్ జిల్లాలో కెసిఆర్ కుటుంబసభ్యులు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.

ఇసుక క్వారీలన్నీ కెసిఆర్ కుటుంబానికే ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. అక్రమ ఇసుక దందాపై గ్రీన్ కోర్ ట్రిబ్యూనల్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు రేవంత్. ఇసుక వ్యాపారం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల, జిల్లెల, సారంపల్లి గ్రామాల థర్డ్ డిగ్రీ బాధితులు టిడిపి ఆఫీసులో రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా బాధితులతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. గడిచిన ఆరు నెలల కాలంలో 10 మంది ఇసుక లారీల వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నారని వారంతా దళిత, బడుగు బలహీన వర్గాల వారే కావడంతో సర్కారు పట్టించుకోవడంలేదన్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక వ్యాపారం నడుపుతున్న వైష్ణవీ గ్రానైట్స్, గోల్డ్ మైన్స్ మినిరల్స్, సాయిరాం గ్రానైట్స్, సాయిరాం మినిరల్స్ సంస్థలన్నీ కెసిఆర్ బంధువులు, సన్నిహితులైన కుటుంబసభ్యులవే అని ఆరోపించారు. అధికార బలంతో కెసిఆర్ బంధువుల ఇసుక కంపెనీలన్నీ నిబంధనలు అతిక్రమించి యంత్రాలతో ఇసుక తవ్వుతూ కోట్లు గడిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక వ్యాపారంలో ఖజానాకు రోజుకు కోటి నష్టం కలుగుతోందని అదంతా ఎవరి జేబులోకి వెళ్తుందో అర్థమవుతుందన్నారు.

 20 టన్నులకు రాయల్టీ చెల్లించి 60 టన్నులు తోడుకుంటున్నారని ఆరోపించారు. ఒక లారీకి చెలానా చెల్లించి 10 లారీలు తిప్పుతున్నారని ఆరోపించారు. లారీల్లో ఓవర్ లోడ్ వేస్తున్నారని, ఇదేమని అడిగితే లారీలతో తొక్కించి చంపుతున్నారని ఆరోపించారు రేవంత్. ఇసుక మాఫియా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, పోలీసుల థర్డ్ డిగ్రీ బాధితులకు 2లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.