కేసిఆర్ ప్లాన్ క్లియర్: లోకసభకు హరీష్, కేటీఆర్ కు సేఫ్ ప్యాసేజ్

KCR eyes on 16 LS seats: Harish Rao may be fielded
Highlights

తన తనయుడు, ఐటి శాఖ మంత్రి కెటి రామారావును ముఖ్యమంత్రిని చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పక్కా వ్యూహరచన చేసినట్లు కనిపిస్తున్నారు.

హైదరాబాద్: తన తనయుడు, ఐటి శాఖ మంత్రి కెటి రామారావును ముఖ్యమంత్రిని చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పక్కా వ్యూహరచన చేసినట్లు కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన మేనల్లుడు, నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావును లోకసభకు పంపించాలని ఆయన అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. తద్వారా రాష్ట్రంలో కేటీఆర్ కు పోటీ లేకుండా చేయాలని ఆయన అనుకుంటున్నారు.

కూతురు కల్వకుంట్ల కవిత ఇప్పటికే లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆమె లోకసభకే పోటీ చేసే అవకాశాలున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ ను ముందుకు తీసుకుని వెళ్లే క్రమంలో కేసీఆర్ లోకసభ స్థానాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. 

హైదరాబాదు సీటును మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి వదిలేసి మిగతా 16 సీట్లను కైవసం చేసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. రాష్ట్రంలోని సీట్లను అన్నింటినీ గెలుచుకుంటే తప్ప ఫెడరల్ ఫ్రంట్ ను ముందుకు తీసుకుని వెళ్లలేమనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. 

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 11 లోకసభ స్థానాలను గెలుచుకుంది. బిజెపి, తెలుగుదేశం, మజ్లీస్, వైఎస్సార్ కాంగ్రెసు ఒక్కో సీటును గెలుచుకున్నాయి. కాంగ్రెసు, టీడీపి, వైసిపి ఎంపీలు టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. 

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అత్యధిక లోకసభ స్థానాలను గెలుచుకోవడానికి ఐదుగురు రాష్ట్ర మంత్రులను లోకసభకు పోటీ చేయించాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. హరీష్ రావు, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస యాదవ్, పట్నం మహేందర్ రెడ్డిలను వచ్చే ఎన్నికల్లో లోకసభకు పోటీ చేయించాలని భావిస్తున్నారు. తద్వారా సీనియర్లను లోకసభకు పంపించి కేటీఆర్ కు రాష్ట్రంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేయాలని కూడా కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. 

లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని కేసీఆర్ ఇప్పటికే వారికి చెప్పినట్లు సమాచారం. అందుకు ప్రతిగా వారి బంధువులకు శాసనసభ స్థానాలకు పోటీ చేసే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను మెదక్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

హరీష్ రావును జహీరాబాద్ నుంచి లోకసభకు పోటీ పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ ను కరీంగనర్ లోకసభ స్థానం నుంచి పోటీకి దించి ఆయన భార్యకు హుజూర్ నగర్ శాసనసభ టికెట్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. కడియం శ్రీహరిని వరంగల్ లోకసభ స్థానం నుంచి పోటీకి దించే అవకాశాలున్నాయి. 

ఖమ్మం లోకసభ స్థానం నుంచి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావును పోటీకి దించి, పాలేరు అసెంబ్లీ టికెట్ ప్రస్తుత ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. శ్రీనివాస యాదవ్ ను సికింద్రాబాదు లోకసభ స్థానంలో పోటీకి పెట్టి ఆయన కుమారుడికి సనత్ నగర్ శాసనసభా స్థానం కేటాయించే అవకాశం ఉంది. 

కాగా, మహేందర్ రెడ్డిని చేవెళ్ల లోకసభ స్థానం నుంచి పోటీ చేయిస్తారని, ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డిని మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి పోటీకి దించుతారని అంటున్నారు. మల్కాజిగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లారెడ్డిపై ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేలో తేలినట్లు సమాచారం. మొత్తం మీద, సీనియర్లను తన వెంట ఢిల్లీకి తీసుకుని వెళ్లి, జూనియర్లను రాష్ట్రంలో ఉంచడం ద్వారా కేటీఆర్ కు రాష్ట్రంలో ఎదురు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. 

loader