హైదరాబాద్:  బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆరోపణలపై తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది బిజెపితో కేసీఆర్ సంబంధాలను దెబ్బ తీసే స్థాయికి వెళ్లిందని అంటున్నారు. 

ఎన్నికల సమయంలో బిజెపి కార్యకర్తల నుంచి 8 లక్షల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకోవడంపై, వారణాసిలో తెలంగాణ రైతులు నామినేషన్లు వేయడంపై అమిత్ షా కేసీఆర్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ రెండు సంఘటనలకు కేసీఆర్ కారణమని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

కేసీఆర్ కు ఫోన్ చేసి అమిత్ షా ఆ రెండు విషయాలపై మాట్లాడినట్లు చెబుతున్నారు. ఆ రెండు సంఘటనలకు ఆయన కేసీఆర్ ను తప్పు పట్టినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ అమిత్ షాపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. 

వారణాసిలో నామినేషన్లు వేయడానికి ఒక్కో అభ్యర్థిని పది మంది స్థానికులు బలపరచాల్సి ఉంటుందని, అందుకు స్థానిక ప్రజలు అందుబాటులో లేరని తెలిసి కూడా టీఆర్ఎస్ పసుపు రైతులను వారణాసి పంపించిందని, మోడీ ప్రతిష్టను దెబ్బ తీయడానికే టీఆర్ఎస్ ఆ పని చేసిందని అమిత్ షా విమర్శించినట్లు తెలుస్తోంది. 

అయితే, అమిత్ షా విమర్శలను కేసీఆర్ తిప్పికొట్టినట్లు తెలుస్తోంది. తన కూతురు కల్వకుంట్ల కవిత పోటీ చేసిన నిజమాబాద్ లోకసభ స్థానంలో 150 మంది పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేసిన విషయాన్ని ఆయన అమిత్ షా దృష్టికి తెచ్చినట్లు సమాచారం. 

బిజెపి కార్యకర్తల నుంచి నగదు స్వాధీనం చేసుకున్న ఘటనతోనూ వారణాసిలో తెలంగాణ రైతులు నామినేషన్లు దాఖలు చేయడంలోనూ తన ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని కేసీఆర్ తేల్చి చెప్పినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

రూట్ మార్చిన కేసీఆర్: మోడీకి కటీఫ్, రాహుల్ తో దోస్తీ

మోడీ, కేసీఆర్ మధ్య బెడిసికొట్టిన సంబంధాలు: అమిత్ షా ఫోన్