తెలంగాణ అసెంబ్లీ దక్షిణాదిలోనే తొలిసారి సంచలన నిర్ణయం తీసుకున్నది. హెడ్ ఫోన్స్ విసిరిన కారణం చూపి ఇద్దరు ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల మీద వేటు వేసింది అసెంబ్లీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలు రద్దయ్యాయి. వారి స్థానాల్లో మళ్ళీ ఎన్నికలు రానున్నాయి. అయితే వారి సభ్యత్వం రద్దు నిర్ణయం వెనుక అసలు గుట్టును కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ సభ్యత్వాల రద్దుపై ఏమన్నారో చదవండి.

కేసిఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి ఇద్దరు శాసన సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని, సంపత్ ను టీఆరెస్ పార్టీలో చేరాలంటూ తీవ్రమైన వత్తిడి చేశారు. కానీ వారు రానందుకే ఇలా ఇలా కక్ష తీర్చుకున్నాడు కేసిఆర్.
అంత గొప్ప వాడైతే.. పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి, ఆ నీచానికి పాల్పడిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం దారుణం. నల్గొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం ల శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలి. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పర్చాలని కాంగ్రెస్ పార్టీ అధికార పక్షాన్ని నిలదీసినందుకు సస్పెండ్ చేశారు.

ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని అద్దం పెట్టుకొని సీఎం కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడు. స్వామి గౌడ్ కు గాయం అయింది అనేది కేసీఆర్ ఆడించిన డ్రామా. దళిత వ్యక్తి అసెంబ్లీకి వస్తే కండ్లు ఓర్వలేక సస్పెండ్ చేపించిండు. కేసీఆర్ ను అలంపూర్, నల్గొండలో కాలు పెట్టనివ్వం, వస్తే రాళ్లతో దాడి చేస్తాం. ఈ రోజు బడ్జెట్లో అమరవీరుల కుటుంబానికి  ఒక్క రూపాయికూడా కేటాయించలేదు. నీళ్లను చూస్తే కాంగ్రెస్ గుర్తొస్తుంది, సారా దుకాణం చూస్తే కేసీఆర్ గుర్తొస్తారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పైన ఒక్క కేసు కూడా లేదు.