హైదరాబాద్‌: తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో డిఎస్ భేటీపై ఆయన ఆరా తీసినట్లు చెబుతున్నారు. తగిన ఆధారాలు దొరికితే డిఎస్ పై వేటుకు తగిన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన ఆధారాల కోసం టీఆర్ఎస్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలు లభ్యమైతే అనర్హత వేటు కోసం రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం అనుకుంటోంది. గురువారం ఢిల్లీలో డీఎస్‌ అమిత్‌షాను కలిసి మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. 

ఆ విషయం టీఆర్ఎస్ ఎంపీలకు తెలియడంతో వెంటనే ఆ విషయాన్ని వారు తమ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఏం చేయాలనే దానిపై పార్టీ నాయకత్వం విస్తృతంగా చర్చ జరిపినట్లు తెలుస్తోంది. గత శాసనసభ ఎన్నికలకు ముందు డీఎస్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

అప్పట్లో ఆయనను సస్పెండ్‌ చేయాలని కేసీఆర్ అనుకున్నారు. సస్పెండ్ చేస్తే ఆయన మరో పార్టీలో చేరతారనే ఉద్దేశంతో చర్య తీసుకోకుండా పార్టీ కార్యకలాపాలకు దూరం పెట్టారు. ఆ తర్వాత  ఆయన సోనియాను కలిసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఫిర్యాదు చేయాలని భావించిన స్థితిలో దానికి తగిన ఆధారాలు లభించలేదు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు స్థానిక నాయకులు ఫిర్యాదు కూడా చేశారు.

బుధవారం డీఎస్‌ ఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ ఎంపీల సమావేశానికి డిఎస్ హాజరయ్యారు. దీని వెనక డీఎస్‌ వ్యూహం ఏమిటనే ఆలోచనలో టీఆర్ఎస్ నాయకత్వం పడింది. అమిత్ షాను కలిశారనే విషయం తెలియగానే డిఎస్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు మరోసారి నాయకత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది.

డీఎస్‌ 2016 జూన్‌లో టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2022 వరకు పదవీ కాలం ఉంది. పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

డి.శ్రీనివాస్‌ గురువారం మధ్యాహ్నం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌ భవనంలోని అమిత్‌షా కార్యాలయానికి వెళ్లి ఆయనను కలిశారు. దాదాపు పది నిమిషాలపాటు ఆయనతో సమావేశమయ్యారు.

సంబంధిత వార్త

అమిత్ షాతో డిఎస్ భేటీ: మతలబు ఏమిటి?