బతుకమ్మ చీరలపై మహిళా కాంగ్రెస్ నిరసన కేసిఆర్ దిష్టిబొమ్మ కాలబెట్టి బతుకమ్మ ఆడిన మహిళలు
కరీంనగర్ గడ్డ మీద కేసిఆర్ దిష్టబొమ్మ కాలింది. అది కూడా మహిళలు కేసిఆర్ దిష్టిబొమ్మ కాలబెట్టారు. తెలంగాణ మహిళలకు బతుకమ్మ పేరుతో నాసిరకం చీరలు ఇచ్చి మహిళా లోకాన్ని మోసం చేశారని తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఆరోపించింది. మహిళలను మోసం చేసిన సిఎం కేసిఆర్, కేటిఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
కరీంనగర్ లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిఎం కేసిఆర్ దిష్టిబొమ్మ కాలబెట్టి నిరసన తెలిపారు. ఆ దిష్టబొమ్మ కాలుతుండగా దానిచుట్టూ బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై నిరసన తెలిపారు.
ఎవరూ అడగకపోయినా బతుకమ్మ చీరల పేరుతో తండ్రీ కొడుకులు ప్రజా ధనం లూటీ చేస్తున్నారని నేరెళ్ల శారద ఆరోపించారు. నాసిరకం చీరలివ్వడమే కాకుండా నిరసన తెలిపిన మహిళలపై కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. కనీసం వంద రూపాయల విలువైన చీరలు కూడా ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు.
చేనేత కార్మికులను ఆదుకుంటామంటూ తీపి మాటలు చెబుతూ సూరత్ కు పోయి పాలిస్టర్, సిల్క్ చీలు తెచ్చి మహిళల మొఖం మీద కొట్టారని మండిపడ్డారు. తక్షణమే మహిళలపై, కంగ్రెస్ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
