హైదరాబాద్: తాజా పరిణామాల నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టం తెచ్చే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలను, ఆర్టీసీ సమ్మె ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అవినీతిని రూపుమాపడానికి, ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించేందుకు కొత్త రెవెన్యూ చట్టం తేవడానికి కొత్త రెవెన్యూ చట్టాన్ని తెస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రెవెన్యూ ఉద్యోగులకు చిక్కులు కల్పిస్తున్న కొన్ని నిబంధనలను తొలగిస్తామని కూడా ఆయన చెప్పారు. అయితే, ప్రస్తుతానికి కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చే విషయాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం. 

ఆర్టీసీ సమ్మె విరమణకు, డిసెంబర్ 11వ తేదీకి మధ్య కేసీఆర్ మంత్రి వర్గం రెండు సార్లు సమావేశమైంది. ఈ సమావేశాల్లో రెవెన్యూ చట్టంపై కేసీఆర్ స్పష్టత ఇస్తారని మంత్రులు భావించారు. ఈ రెండు సమావేశాల్లోనూ కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు కల్పించే ప్రయోజనాలకు, ఆర్టీసీని లాభాల బాట పట్టించే అంశాలకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు.  డిసెంబర్ 11వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త నీటి పారుదల ప్రాజెక్టులపై, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై మాత్రమే చర్చ జరిగింది. 

వేనత సవరణ సంఘం ప్రయోజనాలు కూడా పెండింగులో ఉన్నాయి. రెవెన్యూ చట్టాన్ని పక్కన పెట్టడానికి అది కూడా ఓ కారణమని అంటున్నారు. పే కమిషన్ ప్రయోజనాలను అందించకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొని ఉంది.  

సమ్మె ముగిసిన తర్వాత కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు ఇతోధికమైన వరాలు కురిపించారు. సమ్మె కాలంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆర్టీసీ కార్మికుల్లో ఇంకా వ్యతిరేక భావనే ఉందని చెబుతున్నారు. ఈ స్థితిలో కొత్త రెవెన్యూ చట్టం తెస్తే చిక్కులు ఎదురు కావచ్చునని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.