అసంతృప్తులను బుజ్జగించే పనిలో అపద్ధర్మ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఉన్నారు

హైదరాబాద్: అసంతృప్తులను బుజ్జగించే పనిలో అపద్ధర్మ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఉన్నారు. మహాకూటమి అభ్యర్థులను ప్రకటించే లోపుగా ప్రచారాన్నిసగం గ్రామాల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులను ఆదేశించారు.

సెప్టెంబర్ 6వ తేదీన కేసీఆర్ 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. అయితే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇంకా 25 మంది అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టలేదు.దీంతో కేసీఆర్, కేటీఆర్ ప్రచారాన్ని ప్రారంభించని నేతలను స్థానికంగా ఉన్న పరిస్థితులపై ఆరా తీశారు.

టిక్కెట్లు రాకపోవడంతో కొన్ని స్థానాల్లో అసంతృప్తుల బెడద ఎక్కువైంది. దీంతో అసంతృప్తులను బుజ్జగించేపనిని కేసీఆర్, కేటీఆర్ తీసుకొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులను తెలుసుకొని అసంతృప్తులతో మాట్లాడుతున్నారు.

అసంతృప్తులతో ఇబ్బందులు నెలకొన్న నియోజకవర్గాల్లో నేతలు ఆయా నేతలను తీసుకొని నేరుగా కేటీఆర్, కేసీఆర్‌లను కలిపించి భవిష్యత్‌పై భరోసాను ఇప్పిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో అసంతృప్తుల బుజ్జగింపు కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

రానున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అసంతృప్త నేతలకు నామినేటేడ్ పదవులు, ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇస్తామని కేసీఆర్, కేటీఆర్‌లు హమీ ఇస్తున్నారు. మరోవైపు అయితే మహాకూటమి అభ్యర్థులను ప్రకటించేలోపుగా సగం గ్రామాల్లో ప్రచారాన్ని పూర్తి చేయాలని కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు సూచించారు.