Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ కు కంటి ఆపరేషనేనా? అటువైపో కన్నేశారా?

  • ఢిల్లీ టూర్ పై జోరుగా చర్చలు
  • ఇన్నిరోజులు ఆగి ఇప్పుడే ఎందుకెళ్లారో?
  • కేంద్ర కేబినెట్ పై కన్నేశారా?
  • బిజెపి దూరం  పెడుతోందా?
kcr delhi tour eye operation or eyeing the cabinet

తెలంగాణ సిఎం కేసిఆర్ ఢిల్లీ టూర్ పై రకరకాల ఊహాగానాలు వినబడుతున్నాయి. ఆయన కేవలం కంటి ఆపరేషన్ కోసమే ఢిల్లీ వెళ్లారని అధికార వర్గాలు చెబుతున్నయి. కానీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఇంతకూ కంటి ఆపరేషన్ ఒక్కటేనా? సందుట్లో సడేమియా అన్నట్లు ఇతర పనులేమైనా చక్కబెట్టుకునే అవకాశం ఉందా అన్న చర్చలు ఊపందుకుంటున్నాయి.

తెలంగాణ సిఎం ఢిల్లీ పర్యటనకు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. ఆయన దాదాపు వారం రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేసే అవకాశం ఉంది.  ఈనెల 5వ తేదీన ఆయనకు కంటి ఆపరేషన్ జరుగుతందని అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే ఐదో తేదీన ఆపరేషన్ ఉంటే నాలుగు రోజుల ముందే ఢిల్లీ వెళ్లడం ఎందుకబ్బా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కంటి ఆపరేషన్ కోసం ఢిల్లీ వెళ్లిన సిఎం అనేకసార్లు వాయిదా వేసుకుని వచ్చారు. కానీ ఈసారి నాలుగు రోజుల ముందే వెళ్లడం చర్చనీయాంశమవుతోంది.

గత కొంతకాలంగా కేంద్ర కేబినెట్ లో టిఆర్ఎస్ చేరనుందని ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే కేంద్ర కేబినెట్ లో చేరాలన్న ఆరాటం టిఆర్ఎస్ వైపు నుంచే ఎక్కువగా ఉంది కానీ బిజెపి వైపు నుంచి ఆ ఆలోచన లేనేలేదని బిజెపి నేతలు చెబుతున్నమాట. కానీ టిఆర్ఎస్ మాత్రం ఆ దిశగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోందన్న ప్రచారం ఉంది. ఈ మూడేళ్ల కాలంలో సిఎం కేసిఆర్ తీరును గమనించిన వారంతా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు.

కేసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కౌగిలించుకుంటున్న తీరు కానీ... బిజెపి పార్టీతో డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్న తీరును రాజకీయ జనాలు గుర్తు చేసుకుంటన్నారు.  అదే సందర్భంలో ఎంఐఎంతోనూ కేసిఆర్ దోస్తాన్ చేస్తున్నారు. ఆ విషయంలో బిజెపి గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే కేసిఆర్ తో స్నేహం చేసి కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకుంటే తాము బలపడే రాష్ట్రాల జాబితాలోంచి తెలంగాణను తీసేయాల్సిన ప్రమాదం వస్తుందని బిజెపి నేతలు అంటున్నారు.

మరి ఈ పరిస్థితుల్లో సిఎం నాలుగు రోజుల ముందే ఢిల్లీ వెళ్లడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. తాను ఢిల్లీ వచ్చానన్న సంకేతాలు బిజెపి పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి సంకేతాలు పంపినట్లు చెబుతున్నారు. ఒకవేళ చివరి నిమిషంలో బిజెపి వైపు నుంచి సంకేతాలు అందితే కేంద్ర కేబినెట్ లో చేరిపోవాలన్న తాపత్రయంలో టిఆర్ఎస్ ఉందన్న ప్రచారం సాగుతోంది. మరి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం టిఆర్ఎస్ బెర్త్ లేదు ఏం లేదని కుండబద్ధలు కొట్టారు.

కానీ తెలంగాణ సిఎం కేసిఆర్ మాత్రం తనదైన శైలిలో ఢిల్లీలో మకాం వేసి మంత్రాంగం నడుపుతున్నారు. వ్యూహం రచిస్తున్నారు. ఏమో ఎవరు చెప్పగలరు? గుర్రం ఎగరా వచ్చన్న ముచ్చట.

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Follow Us:
Download App:
  • android
  • ios