లోక్‌‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుపొందాలనే పట్టుదలతో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకు అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే అంగబలం, అర్థబలం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసిన సీఎం క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు.

ప్రత్యేకంగా ఎంపిక చేసిన పార్టీ అధిష్టాన శిబిరం ముఖ్యులను ఈ స్క్వాడ్‌లో భాగం చేశారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వీరిని పంపిస్తున్నారు. వీరు స్థానిక ఎంపీ అభ్యర్థులు, అక్కడి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో స్వయంగా మాట్లాడి అప్రమత్తం చేస్తున్నారు.

అవసరమైన చోట్ల పరిస్ధితులను చక్కబెట్టి, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే ఈ స్క్వాడ్ కర్తవ్యం. ఇది ముఖ్యమంత్రి  ఆధీనంలో పనిచేస్తుంది. పార్టీ నేతలు ఏ స్థాయి వారైనా వారి మధ్య సమన్వయం కుదర్చటం, ఎన్నికల్లో సరిగా పనిచేసేలా చూడటం స్క్వాడ్ ప్రధాన బాధ్యతగా తెలుస్తోంది.

క్షేత్ర స్థాయిలో పరిస్థితులు, అభ్యర్థులు, కార్యకర్తల పనితీరును ఈ బృందం కేసీఆర్‌కు వివరిస్తుంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అధినేత రాజకీయ కార్యదర్శి సుభాష్ రెడ్డి పెద్దపల్లి నియోజకవర్గానికి వెళ్లారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖమ్మంలో మకాం వేశారు.