హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీతో తనకు ఉన్న అనుబంధాన్ని, తెలంగాణతో ప్రణబ్ కు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు. తన పుస్తకాల్లో ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ గురించి ప్రస్తావించారని అన్నారు. 

కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రణబ్ ముఖర్జీ ప్రాణాలు కాపాడడానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ అంశంతో ప్రణబ్ కు ఎంతో అనుబంధం ఉందని సిఎం అన్నారు. యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు.  తెలంగాణ రాష్ట్ర డిమాండ్ లో న్యాయం ఉందని భావించే వారని, తాను కలిసిన ప్రతీ సారి ఎన్నో విలువైన సూచనలు చేసే వారని సిఎం గుర్తు చేసుకున్నారు. 

ఒక నాయకుడికి ఉద్యమాన్ని ప్రారంభించి, విజయతీరాలకు చేర్చే అవకాశం దక్కడం  అరుదుగా సంభవిస్తుందని, ఆ ఘనత మీకు దక్కిందని అని తనను ప్రత్యేకంగా అభినందించారని కేసీఆర్ చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ద కొయలేషన్ ఇయర్స్’ పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని, కేసీఆర్ కు తెలంగాణ అంశమే తప్ప పోర్టు ఫోలియో అక్కరలేదని పేర్కన్నారని గుర్తు చేశారు. 

దీన్ని బట్టి తన జీవితకాలంలో తెలంగాణ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదిగా గుర్తించినట్లు అర్థమవుతున్నదని కేసీఆర్ అన్నారు. యాదాద్రి దేవాలయన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారన్నారు. ప్రణబ్ మరణం తీరని లోటని సిఎం బాధను వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తన తరుఫున, తెలంగాణ ప్రజల తరుఫున ప్రణబ్ కు నివాళి అర్పించారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రణబ్ ముఖర్జీ మృతికి మంత్రి కెటీఆర్ సంతాపం ప్రకటించారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలియజేశారు. అప్పటి యుపిఎ ప్రభుత్వం తెలంగాణపై ఏర్పాటు చేసిన కమిటికీ ప్రణబ్ ముఖర్జీ సారథ్యం వహించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ సాకారం అయ్యేందుకు సహకరించారని చెప్పారు. 

భారత మాజీరాష్ట్రపతి "భారత రత్న" శ్రీ ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల మంత్రి ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రజల కల నెరవేరిందని చెప్పారు. అందుకే ఆయన చిరస్మరణీయుడని మంత్రి అన్నారు. ఆయన మరణం దేశానికి తీరనిలోటు అని అన్నారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ప్రణబ్ మరణం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు. తెలంగాణ సమాజం ప్రణబ్ ముఖర్జీని ఎప్పటికీ గుర్తు ఉంచుకుంటుందని ఆయన చెప్పారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అప్పటి యూపిఏ ప్రభుత్వం వేసిన కమిటీకి ప్రణబ్ ముఖర్జీ యే చైర్మన్ అని ఆయన గుర్తు చేశారు.
 
తెలంగాణ రాష్ట్రం బిల్లు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడే ఉభయ సభల్లో ఆమోదం పొందిందని ఆయన అన్నారు. అటువంటి మహానేత మరణంతో ఏర్పడ్డ లోటు పూడ్చలేనిదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.