Asianet News TeluguAsianet News Telugu

బీఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు : బండి సంజయ్

Bandi Sanjay: ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రజలు ఈ మూడు పార్టీలను సమాధి చేసి బీజేపీకి మద్దతివ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 
 

KCR conspiring to split anti-BRS votes: BJP candidate for Karimnagar, Bandi Sanjay Kumar RMA
Author
First Published Nov 9, 2023, 5:55 AM IST

Telangana Assembly Elections 2023: బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను చీల్చి మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్న సంద‌ర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కరీంనగర్ ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. భూకబ్జాలు, మాదకద్రవ్యాల దందా, మాఫియా స్థాయి కార్యకలాపాల ద్వారా కమీషన్ల‌ పాలనకు బీఆర్ఎస్ నేతలు పాల్పడ్డారని ఆరోపించారు.

కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై వ్యతిరేకత ఎక్కువగా ఉందన్నారు. కమలాకర్ ను ఓడించేందుకు బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారనీ, ఎందుకంటే వారు కూడా అవినీతి నేతగా కమలాకర్ రికార్డులపై విసుగు చెందుతున్నారని సంజయ్ కుమార్ అన్నారు. అందుకే కేసీఆర్ ఇచ్చిన డబ్బులతో కాంగ్రెస్ పార్టీ అలాంటి అభ్యర్థికి టికెట్లు కేటాయించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ కు అమ్మేసిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న జిమ్మిక్కులకు ప్రజలు మోసపోవద్దనీ, బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను చీల్చొద్దని సూచించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారని గుర్తుంచుకోవాలన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలను ఆయన అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు.

అలాగే, మానకొండూర్ బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న సంద‌ర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి రస‌మాయి బాలకిషన్ మాదిరిగా కాకుండా మోహన్ పక్కా లోకల్ అభ్యర్థి అనీ, ఆయనకు నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉందన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు. చాలా నియోజక వర్గాల్లో పలు రోడ్డు సమస్యలకు సంబంధించి బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నార‌ని అన్నారు. తెలంగాణలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రజలు ఈ మూడు పార్టీలను సమాధి చేసి బీజేపీకి మద్దతివ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios