కేంద్రంలోని బీజేపీతో ఢీకొట్టిన సందర్భంలో బీఆర్ఎస్‌కు మోయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసు అందివచ్చిన బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడింది. ఆ కేసులో నలుగురు ఎమ్మెల్యేలు బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీనం హర్షవర్ధన్ రెడ్డిలు కీలకంగా ఉన్నారు. వీరికి బీఆర్ఎస్ మరోసారి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. 

హైదరాబాద్: రాష్ట్రం వర్సెస్ కేంద్రంగా సాగినప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి మోయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసు బలమైన అస్త్రంగా పనికి వచ్చింది. ఈ పరిస్థితులను అప్పుడు కొందరు మోయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసు వర్సెస్ ఢిల్లీ లిక్కర్ కేసుగా అభివర్ణించారు. కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడిని అధిగమించడానికి, బీఆర్ఎస్ బలంగా నిలబడటానికి ఈ ఫామ్‌హౌజ్ కేసు అనూహ్యంగా ఉపయోగపడిందని రాజకీయవర్గాలు చర్చించాయి. ఈ నేపథ్యంలోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ అప్పుడు ప్రశంసలతో ఆకాశానికెత్తారు. పార్టీలో వారు ఆణిముత్యాలంటూ పొగడ్తలు కురిపించారు. అప్పుడే ఈ నలుగురికి టికెట్ దాదాపు కన్ఫామ్ అనే టాక్ వినిపించింది. ఇప్పుడు ఆ టాక్ నిజమైంది.

మోయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసుతో సంబంధం ఉన్న నలుగురు సిట్టింగ్‌లకు కేసీఆర్ టికెట్‌ను కన్ఫామ్ చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులు ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు. వీరికి తిరిగి బీఆర్ఎస్ సీట్లను కన్ఫామ్ చేసింది.

ఇప్పటికీ కేంద్రంతో బీఆర్ఎస్‌కు సానుకూల వాతావరణం లేదు. ఈ నేపథ్యంలోనే మోయినాబాద్ కేసులో ప్రతికూల పరిణామాలు ఏర్పడవద్దనే ముందు జాగ్రత్తగా ఈ నలుగురికి కేసీఆర్ టికెట్లు కన్ఫామ్ చేశారనే వార్తలు వచ్చాయి.

Also Read: జనగామ సీటు పై సస్పెన్స్.. బీఆర్ఎస్ టికెట్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కా? పల్లా రాజేశ్వర్ రెడ్డికా?

బాలరాజు మినహా మిగిలిన ముగ్గురు కాంగ్రెస్‌ టికెట్ పై గెలిచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో సహజంగానే ఈ మూడు స్థానాల్లోని బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతల నుంచి అసమ్మతి ఎదురైంది. వీరిపై వ్యతిరేకత కూడా వచ్చింది. కానీ, బీఆర్ఎస్ అధినాయకత్వం వాటినేవీ పరిగణనలోకి తీసుకోలేదు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వల వేసి ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నించిందని మోయినాబాద్ ఫామ్ హౌజ్ ఘటనతో అధికార పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే.