కొన్ని రోజులుగా ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా పోరు జరిగిన జనగామ నియోజకవర్గంపై బీఆర్ఎస్ అధిష్టానం ఇంకా టికెట్ గురించి తేల్చలేదు. టికెట్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికా? పల్లా రాజేశ్వర్ రెడ్డికా? అనే సస్పెన్స్ కంటిన్యూ చేశారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఈ రోజు ఏకకాలంలోనే 115 అసెంబ్లీ స్థానాల్లో టికెట్లను ఖరారు చేసి ప్రకటించారు. 115 స్థానాల్లో బీఆర్ఎస్ టికెట్లు పొందే అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. నాలుగు స్థానాల్లో సస్పెన్స్ కంటిన్యూ చేశారు. కొన్ని రోజులుగా టెన్షన్‌గా మారిన జనగామ నియోజకవర్గం కూడా ఈ నాలుగు స్థానాల్లో ఉన్నది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అభ్యర్థిత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అంతా సజావుగా ఉంటే ఈ స్థానానికి కూడా టికెట్ పై స్పష్టత ఇచ్చేవారనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఎసరు వస్తుందా? అనే కోణంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇదే సీన్ కొనసాగిన స్టేషన్ ఘనపూర్‌లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపల్లి రాజయ్యను కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ప్రకటించారు. దీంతో జనగామ టికెట్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికే దక్కుతుందా? ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి వస్తుందా? అనేది తేల్చుకోలేకపోతున్నారు.
స్టేషన్ ఘనపూర్, జనగామలో సేమ్ సీన్ నడిచింది. స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మెల్యే రాజయ్యకు కాకుండా ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ దక్కుతుందనే ప్రచారం జరిగింది. జనగామలోనూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కాకుండా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ దక్కుతుందని వార్తలు వచ్చాయి. దీంతో ఈ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేల మద్దతుదారులు రోడ్డెక్కి నిరసనలు చేశారు. తమ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వాలని, ఎమ్మెల్సీకి వద్దంటూ నినాదాలు చేశారు.
Also Read: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా: ఇద్దరు ఎమ్మెల్సీలకు చోటు
కానీ, స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మెల్యేను కాదని ఎమ్మెల్సీకి టికెట్ కన్ఫమ్ అయింది. అదే జనగామలో మాత్రం సస్పెన్సే ఉన్నది. టికెట్ దక్కదనే ఆరోపణలతో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్వయంగా స్పందించి మీడియా ముందు కంటతడి పెట్టుకోవడంతో నిజంగానే ఎమ్మెల్సీ పల్లారెడ్డి వైపే బీఆర్ఎస్ మొగ్గుచూపిందా? అనే వాదనలు బలంగా వచ్చాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డి కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీసి డిఫేమ్ చేస్తున్నామని ముత్తిరెడ్డి ఆరోపించారు. తన కూతురిని ఇందుకు పావుగా వాడుకుని తనను దెబ్బతీసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కొన్నాళ్లుగా పల్లా ఇంటిలో కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుమారుడు ఉన్నాడని, ఆయన తన అల్లుడి క్లాస్ మేట్ అని, పల్లా రాజేశ్వర్ రెడ్డి వారి ద్వారానే తన బిడ్డను తప్పుదారి పట్టించారని ఆరోపించారు.
