Asianet News TeluguAsianet News Telugu

ఆ 20 సీట్లే కేసీఆర్ టార్గెట్: రేవంత్ సహా కాంగ్రెస్ దిగ్గజాలే లక్ష్యం

తెలంగాణలోని విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న 20 సీట్లపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానాల నుండి టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించే లక్ష్యంతో ఆయన పావులు కదుపుతున్నారు.ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్ధులను దెబ్బతీసేలా టీఆర్ఎస్ వ్యూహలను రచిస్తోంది.

KCR concentrates on 20 Assembly segments of opposition party MLAs


హైదరాబాద్: రాష్ట్రంలోని 20 అసెంబ్లీ స్థానాల్లో విపక్ష అభ్యర్ధులను వచ్చే ఎన్నికల్లో మట్టికరిపించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గాలిని తట్టుకొని కూడ ఈ స్థానాల్లో  విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో ఈ స్థానాలపై కేసీఆర్ కన్నేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధిస్తారని  నాలుగైదు సర్వే ఫలితాల్లో తేలిందని కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. అయితే  గత ఎన్నికల్లో  తమ అభ్యర్ధులను ఓడించి రాజకీయంగా  ఇబ్బందులకు గురిచేస్తున్న నేతలను అసెంబ్లీకి రాకుండా  చేయాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు.

 కేసీఆర్ వ్యూహం ప్రకారంగా విపక్ష పార్టీలకు చెందిన 20 మంది కీలక నేతలను 2019 ఎన్నికల్లో అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  ఈ మేరకు ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలకు కేసీఆర్ దిశానిర్ధేశం చేస్తున్నారు.

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్‌ 63 స్థానాలను కైవసం చేసుకొంది. అయితే రాజకీయ పునరేకీకరణ పేరుతో కేసీఆర్ నిర్వహించిన ఆపరేషన్ ఆకర్ష్‌లో బీఎస్పీ నుండి ఇద్దరు. టీడీపీ నుండి 12 మంది, కాంగ్రెస్ నుండి ఏడుగురు,.  వైసీపీ నుండి ముగ్గురు, సీపీఐ నుండి ఒక్కరు టీఆర్ఎస్ లో చేరారు.పాలేరు, నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ విజయం సాధించింది.  దీంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 90 కు చేరుకొంది. 

అయితే అసెంబ్లీ లోపల, బయట రాజకీయంగా తమను ముప్పు తిప్పలు పెడుతున్న నేతలను అసెంబ్లీ అడుగుపెట్టకుండా అడ్డుకోవాలని టీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది.  

 కాంగ్రెస్ లో జానారెడ్డి(నాగార్జునసాగర్‌), ఉత్తమ్‌(హుజూర్‌నగర్‌), పద్మావతి(కోదాడ), మల్లు భట్టి విక్రమార్క(మధిర), జీవన్‌రెడ్డి(జగిత్యాల), రామ్మోహన్‌రెడ్డి(పరిగి), డీకే అరుణ(గద్వాల), వంశీచంద్‌రెడ్డి(కల్వకుర్తి) మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(నల్గొండ), సంపత్‌కుమార్‌(అలంపూర్‌)ల శాసనసభ సభ్యాత్వాలు ఇటీవల రద్దయ్యాయి. 

నర్సంపేట అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్‌ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. టీడీపీలో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరైన రేవంత్‌రెడ్డి(కొడంగల్‌) కాంగ్రెస్ లో చేరారు. ఇక టీడీఎల్పీలో సండ్ర వెంకటవీరయ్య(సత్తుపల్లి), ఆర్‌.కృష్ణయ్య(ఎల్బీనగర్‌) మిగిలారు. సీపీఎం ఏకైక ఎమ్మెల్యే భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానాలన్నింటి పైనా టీఆర్‌ఎస్‌ రాజకీయంగా దృష్టి సారించింది. 

ముందస్తు ఎన్నికలకు కూడ టీఆర్ఎస్ సన్నద్దమైంది. ఈ తరుణంలో  కేసీఆర్ ఈ 20 అసెంబ్లీ స్థానాలపై కేంద్రీకరించారు. ఈ స్థానాల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించేలా కేసీఆర్ ఇప్పటి నుండే కసరత్తు చేస్తున్నారు. 

విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల ప్రాతినిథ్యం వహిస్తున్న  నియోజకవర్గాల్లో  క్షేత్రస్థాయిలో కూడ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు అనుగుణంగా టీఆర్ఎస్ వ్యూహలను రచిస్తోంది. మండల, గ్రామస్థాయి నేతలను టీఆర్ఎస్‌లోకి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది.

టీడీపీ నుండి  కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై ఇప్పటికే మంత్రులు మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావులు దృష్టిపెట్టారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గాలపై మంత్రి జగదీష్‌రెడ్డి కేంద్రీకరించారు. హుజూర్‌నగర్, కోదాడ,నాగార్జునసాగర్ ,నల్గొండ  అసెంబ్లీ నియోజకవర్గాలపై మంత్రి కేంద్రీకరించారు.ఇందులో భాగంగానే నల్గొండలో టీడీపీ నుండి భూపాల్ రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకొన్నారు.

అలంపూర్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే అబ్రహంకు కొత్తగా టీఆర్‌ఎస్‌ తీర్థం ఇచ్చారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర అసెంబ్లీ స్థానంతో పాటు, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్థానం భద్రాచలంపై ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు లు  టీఆర్ఎస్‌ను బలోపేతం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

గద్వాల జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి టీఆర్ఎస్‌ను ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్  స్యయంగా ప్రజలను కోరారు. గద్వాలో మాజీ మంత్రి డీకే అరుణను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. 

గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో బీజేపీకి ఐదు ఎమ్మెల్యే స్థానాలు, ఓ ఎంపీ స్థానం దక్కింది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల పొత్తు ఈ రెండు పార్టీలకు కలిసి వచ్చింది. దీంతో గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయింది. అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్  గ్రేటర్‌లో బలమైన ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది.

ఇప్పటికే మాజీ మంత్రి దానం నాగేందర్‌ను టీఆర్ఎస్‌లో చేర్చుకొన్నారు.టీడీపీకి చెందిన కీలక నేతలు టీఆర్ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రేటర్‌ నేతలతో టీఆర్ఎస్ నాయకత్వం  సంప్రదింపులు జరుపుతోందని ప్రచారం సాగుతోంది.  త్వరలోనే గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు టీఆర్ఎస్‌లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు కూడ విన్పిస్తున్నాయి..


 

Follow Us:
Download App:
  • android
  • ios