ఇళ్ల నిర్మాణంలో లంచం అడిగే బ్రోకర్లను చెప్పుతో కొట్టాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పథకం పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం...
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన అల్లావుద్దీన్ దీపం.
ఇప్పటికే ఇదే తమ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు కూడా.
అయితే లబ్దిదారుల ఎంపిక నుంచి ఇంటిని నిర్మించే కాంట్రాక్టర్ల వరకు అన్నింటా అయోమయం నెలకొంది.
ఒక్కో జిల్లాలో ఒక్కో సమస్యతో ఈ పథకం నత్తనడకన సాగుతోంది. సీఎం కేసీఆర్ చెప్పినట్లు 9 నెలల్లో 2 లక్షల ఇళ్లు నిర్మించడం సాధ్యం కాదని ఎమ్మెల్యేలే చేతులెత్తేస్తున్నారు.
కానీ, సీఎం కేసీఆర్ మాత్రం 9 నెలల్లో రాష్ట్రంలో 2 లక్షల ఇళ్లు నిర్మించితీరుతామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
ఈ పథకాన్ని నమ్ముకొనే వచ్చే ఎన్నికల్లో ముందుకువెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తుండటంతో గులాబీ బాసు నుంచి కార్యకర్తల వరకు అందరి ఫోకస్ దీనిపైనే ఉంది. ఇక ప్రజల ఆశలు కూడా ఈ పథకం పైనే ఉన్నాయి.
వారి ఆశలను చిగురించేలా ఇప్పటికే హైదరాబాద్ లోని తలసాని కోటలో, సీఎం కేసీఆర్ దత్తతగ్రామం ఎర్రవెల్లి, ముల్కనూరులో డబుల్ బెడ్ రూం లను త్రిబుల్ స్పీడ్ తో కట్టేశారు.
దీంతో ప్రజలు ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లపై బోలుడు ఆశలు పెట్టుకున్నారు. కానీ, లబ్దిదారుల ఎంపిక మాత్రం గులాబీ నేతల కనుసన్నల్లోనే సాగుతోంది. అర్హలనుకాదని గులాబీ కార్యకర్తలకే ఇళ్లన్నీ దక్కే పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తోంది.
ఈ విషయం మంత్రుల దృష్టికి కూడా వచ్చింది. దీంతో ఈ విషయంపై ఐటీ మంత్రి కేటీఆర్ కాస్త ఘాటుగానే స్పందించారు.
ఇళ్ల నిర్మాణంలో లంచం అడిగే బ్రోకర్లను చెప్పుతో కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పథకం పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ఇళ్ల మంజూరులో మద్యవర్తులను నమ్మవద్దని సూచించారు.
అయితే లబ్దిదారులను ఎంపిక చేసే వారు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పే దళారులందరూ గులాబీ కార్యకర్తలే. ప్రతీ నియోజకవర్గంలో వారు సూచించినవారికే డబుల్ పథకం వర్తిస్తోంది. ఈ విషయం కేటీఆర్ కు తెలియదా.. లేక తెలిసి కూడా అలా అనేశారా అనేదే తెలియడం లేదు.
