రైతుల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్దంగా ఉన్నారని చెప్పారు.
ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్దంగా ఉన్నారని చెప్పారు. రైతుల సమస్యలపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతుల కోసం రాజకీయ పార్టీ మద్దతు కూడగతామని అన్నారు. రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని చెప్పారు. తెలంగాణలో పండించిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో టీఆర్‌ఎస్ పోరును మరింత ఉధృతం చేసింది. గత కొన్ని రోజులు నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలోనే రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా దీక్ష చేపట్టింది. ఈ దీక్షకు సీఎం కేసీఆర్, రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్, మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దీక్షకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన రాకేష్ టికాయత్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ నుంచి ఇంత దరం వచ్చి దీక్ష చేయడానికి కారణమెవరని కేసీఆర్ ప్రశ్నించారు. ఎవరితోనైనా గొడవ పడొచ్చని.. కానీ రైతులతో పడొద్దని అన్నారు. కేంద్రాన్ని గద్దె దించే సత్తా రైతులకు ఉందన్నారు. రైతుల్ని కన్నీరు పెట్టిస్తే ఆ పాపం ఉరికేపోదని అన్నారు. తెలంగాణ రైతులు చేసిన పాపం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని అన్నారు.
కేంద్ర మంత్రి తెలంగాణ రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా బాధకరమైనవని కేసీఆర్ అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలు నూకలు తినాలని చెప్పారని.. తాము మేము పీయూష్ గోయల్ వద్ద అడుక్కోవడానికి వచ్చామా..? అని ప్రశ్నించారు. పీయూష్ గోయల్ ఉల్టా పల్టా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పీయూల్ గోయల్ కాదు.. పీయూల్ గోల్ మాల్ అని విమర్శించారు. పీయూష్ గోయల్‌కు ఏమైనా అవగాహన ఉందా.. ఇంత సంస్కార హీనంగా మాట్లాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణకు దేశం మొత్తం ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తారని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో సాగు తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. తెలంగాణను కోట్లాడి సాధించుకున్నామని.. రాష్ట్ర సాధనలో వందలాది యువత బలిదానాలు చేసిందని గుర్తుచేశారు. ఉద్యమాల ఫలితంగా 2014లో తెలంగాణ వచ్చిందని తెలిపారు. రాష్ట్రం వచ్చాక రైతుల కోసం అనేక సంస్కరణలు తెచ్చామని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్దరించామని.. దేశవ్యాప్తంగా ఎక్కడా లేనంతగా 30 లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయని చెప్పారు. మోటార్, విద్యుత్ తీగలు, బోర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు.
దేశంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కేసీఆర్ అన్నారు. ప్రధాన మంత్రి మోదీ సొంత రాష్ట్రంలో కూడా విద్యుత్ కోసం రైతులు ఆందోళన చేస్తున్నారని అన్నారు.
సాగు చట్టాలపై కేంద్రానికి వ్యతిరేకంగా.. రైతులకు అండగా అలుపెరగని పోరాటం చేసిన టికాయత్‌ను ఎన్నో రకాలుగా కేంద్రం అవమానించిందని కేసీఆర్ అన్నారు. టికాయత్‌ను దేశ ద్రోహి, ఉగ్రవాది అన్నారని చెప్పారు. తాము టికాయత్ వెంట ఉంటామచి చెప్పారు.
రైతులను ధాన్యం పండించమని బీజేపీ నేతలు చెప్పారని.. వీడియోలు ప్రదర్శించారు. ధాన్యం కొంటామని చెప్పిన కిషన్ రెడ్డి కోతలు మొదలైననాటి పత్తా లేకుండా పోయారని ఆరోపించారు. తాము దిల్లీలో ధర్నా చేస్తే.. పోటీగా భాజపా నేతలు హైదరాబాద్‌లో నిరసన చేస్తున్నారని మండిపడ్డారు. ఏ ఉద్దేశంతో భాజపా నేతలు ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు.
కేంద్రానికి ఎదురుతిరిగితే సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేయిస్తారని విమర్శించారు. బీజేపీలో అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారా అని ప్రశ్నించారు. తనను జైలుకు పంపుతామని బీజేపీ నేతలు అంటున్నారని.. సీఎంను జైలులో పెడతారా..? అని ప్రశ్నించారు. దమ్ముంటే రావాలని సవాలు విసిరారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్టుగా చెప్పారు. మోదీ, పీయూష్ గోయల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
