వేల ఎకరాల భూకబ్జా కోసమే కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నారు: కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు
కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడంపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు వేల ఎకరాల భూమిని కబ్జా చేయాలనే కామారెడ్డికి వస్తున్నారని అన్నారు. రైతులంతా ఏకమై కేసీఆర్‌ను ఓడించాలని పిలుపు ఇచ్చారు.
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ ఈ రోజు కామారెడ్డిలో పర్యటించారు. అక్కడ రైతులతో ఆయన సమావేశం అయ్యారు. కామారెడ్డిలో పోటీ చేయబోతున్న కేసీఆర్ పై విమర్శలు సంధించారు. రెండు వేల ఎకరాల భూమిని కబ్జా చేయడానికే కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నారని ఆరోపించారు. తాను రైతుల కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కేఏ పాల్ అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలూ ఒక్కటే అని కేఏ పాల్ ఆరోపించారు. ఇందులో ఏ పార్టీకి ఓటు వేసినా అది కేసీఆర్‌కు ఓటు వేసినట్టే అని పేర్కొన్నారు. కామారెడ్డిలో సదాశివనగర్ మండలంలో అడ్లుర్ ఎల్లారెడ్డి గ్రామంలో మాస్టర్ ప్లాన్ భూ బాధిత రైతులతో కేఏ పాల్ గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Also Read: బీజేపీ పై బండి సంజయ్ అసంతృప్తి.. ‘నా ఇమేజ్ దెబ్బతీయడానికే కరీంనగర్ టికెట్’
కుల మతాలకు అతీతంగా రైతులంతా ఒక్కటవ్వాలని కేఏ పాల్ వారికి పిలుపు ఇచ్చారు. కామారెడ్డిలో పోటీ చేస్తున్న కేసీఆర్‌ను ఓడించాలని అన్నారు. కామారెడ్డిలో రెండు వేల ఎకరాల భూమిని కబ్జా చేయాలనే దురుద్దేశంతోనే కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే కేసీఆర్‌ను ఇక్కడ ఓడించాలని కోరారు. ఒక వేళ కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడిస్తే ఉచిత వైద్యం, విద్య, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే హామీ నాదీ అని కేఏ పాల్ అన్నారు.
సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలోనూ పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.