తెలంగాణాలో చ‌నిపోయిన 69 మంది జ‌ర్న‌లిస్టుల‌ కుటుంబాలకు లక్ష రుపాయల చొప్పున చెక్కులను ముఖ్యమంత్రి అందించారు
సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు జే. శ్రీనివాసులు (జెస్సీ) కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ రోజు ఆయన ప్రగతి భవన్లో జర్నలిస్టులతో జనహిత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు లక్షల చెక్ను జెస్సీ భార్య అన్నపూర్ణకు ముఖ్యమంత్రి అందజేశారు.
జె.శ్రీనివాసులు (పక్క ఫోటో)దాపు 30 ఏళ్లుగా స్పోర్ట్స్ జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో పనిచేశారు.
ఇటీవలే ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.
జర్నలిస్టులకు ఎటువంటి ఇబ్బందులున్నా ప్రభుత్వం పరిష్కరిస్తదని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. సీనియర్ జర్నలిస్ట్ హరికిషన్రెడ్డి గుండె మార్పిడి కోసం రూ.10లక్షలు మంజూరు చేసినమని సీఎం తెలిపారు. ఇవాళ ప్రగతి భవన్ లో జరిగిన జనహిత కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చనిపోయిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చనిపోయిన జర్నలిస్టులకు పెళ్లీడు అమ్మాయిలుంటే రూ.3లక్షలు రిలీఫ్ ఫండ్ నుంచి అందిస్తమని స్పష్టం చేశారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఏ జిల్లా వారికి ఆ జిల్లాలో డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తమని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో అల్లంనారాయణతో కలిసి పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ఇంతమంచి కార్యక్రమం చేపట్టినందుకు సీఎం కేసీఆర్ ప్రెస్ అకాడమీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అంటూ జర్నలిస్టులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కచ్చితంగా కల్పించడం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.
జర్నలిస్టుల కష్టాలున్నాయని, అవి వింటుంటే మనసు చలిస్తుందని చెబుతూ, ‘రాష్ట్రంలో 20వేల మంది జర్నలిస్టులున్నారు. ఇప్పటికే రూ.20కోట్లు కేటాయించాం. వచ్చే బడ్జెట్లో ఈ నిధిని రూ.30కోట్లకు పెంచుతాం,’ అని కూడా ఆయన మాట ఇచ్చారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయడంలో తెలంగాణా దేశంలోనే ముందుంటుందని ఈ విషయంలో అనుమానాలకు తావులేదని కూడా కెసిఆర్ చెప్పారు.
రాష్ట్ర జర్నలిస్టులను ఆదుకోవడంతో కేసీఆర్ ప్రభుత్వం ముందు ఉంటుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో చనిపోయిన 69 మంది జర్నలిస్టుల కుటుంబాలను లక్ష రుపాయల చెక్కులను ముఖ్యమంత్రి అందచేశారు.
