రైతు బంధు పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని గత కొద్దిరోజులుగా నడుస్తున్న వివాదానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెరదించారు. ఇప్పుడిస్తున్న పంటల పెట్టుబడి సాయాన్ని కౌలు రైతులకు వర్తించబోమని కేసీఆర్ తేల్చి చెప్పారు.. రైతు బంధు పథకం కేవలం రైతుల కోసమేనన్నారు.. కౌలు రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలన్న డిమాండ్ అర్థరహితమని సీఎం అన్నారు.

కౌలు రైతులు ఎవరనేది స్పష్టంగా ఎవరూ చెప్పలేరని.. ఒకే ఏడాది ఇద్దరు ముగ్గురికి కూడా కౌలుకిస్తారని.. ప్రభుత్వం వద్ద కూడా కౌలు రైతు వివరాలు లేవని.. అలాంటి వారికి ఏ ప్రాతిపదికన పెట్టుబడి ఇవ్వాలని కేసీఆర్ ప్రశ్నించారు. కౌలు రైతుల పేరుతో అసలు రైతుకు అన్యాయం చేయమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కౌలు రైతుల పేరు చెప్పి అసలు రైతులకు అన్యాయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పంట పెట్టుబడి నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని.. పంపిణీలో తలెత్తుతున్న ఇబ్బందులను రైతు సమన్వయ సమితి సభ్యులు పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు.