తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ఆసక్తికరంగా సాగింది. కాళేశ్వరం కమీషన్ కేసీఆర్ ను విచారించే సమయంలో అందరినీ బయటకు పంపించింది. కేసీఆర్ కోరికమేరకే ఇలా చేసారు జస్టిస్ పిసి ఘోష్. 

KCR Kaleshwaram Commission: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమీషన్ ముందు విచారణకు హాజరుకావడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇవాళ (బుధవారం) ఉదయమే ఎర్రవెల్లి ఫాంహౌస్ నుండి హైదరాబాద్ కు చేరుకున్న కేసీఆర్ బిఆర్కే భవన్ లో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం బాగాలేదని.. బహిరంగ విచారణ కాకుండా ఇన్ కెమెరా విచారణ చేపట్టాలని కోరారు కేసీఆర్. ఇందుకు అంగీకరించిన విచారణ కమీషన్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ ఓపెన్ కోర్టు నుండి అందరినీ బయటకు పంపించారు.

కేసీఆర్ తో జస్టిస్ పిసి ఘోష్, కమీషన్ కార్యదర్శి మురళీధర్ మాత్రమే విచారణ హాల్లో ఉన్నారు. కేసీఆర్ ను వన్ టూ వన్ విచారణ జరిపారు జస్టిస్ పీసీ ఘోష్. ఈ విచారణ మొత్తాన్ని రికార్డ్ చేసారు. దాదాపు 50 నిమిషాలపాటు కేసీఆర్ విచారణ కొనసాగింది. ప్రస్తుతం విచారణ ముగియడంతో కేసీఆర్ బిఆర్కే భవన్ నుండి వెళ్లిపోయారు.

కేసీఆర్ విచారణ ఇలా సాగింది :

ఉదయమే ఎర్రవల్లి ఫాంహౌస్ నుండి కేసీఆర్ హైదరాబాద్ కు బయలుదేరారు. ఆయనవెంట మేనల్లుడు హరీష్ రావుతో పాటు ప్రశాంత్‌ రెడ్డి, పద్మారావు గౌడ్‌, మహమూద్‌ అలీ, వద్దిరాజు రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ లు ఉన్నారు. కేవలం వీరిని మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ జరిగే బిఆర్కే భవన్ లోకి అనుమతించారు.

ఉదయం 11.30 గంటలకు విచారణ ప్రారంభమయ్యింది. కేసీఆర్ ను ఓపెన్ కోర్టులో విచారించాల్సి ఉండగా అనారోగ్య కారణాల వల్ల వన్ టు వన్ విచారణ చేపట్టారు. కేసీఆర్ వెంటవచ్చినవారితో పాటు ఇతర న్యాయ నిపుణులు, మీడియాతో సహా అందరినీ కాళేశ్వరం కమీషన్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ కోర్టు హాల్ లోంచి బయటకు పంపించారు. అనంతరం జస్టిస్ పిసి ఘోష్ విచారణ ప్రారంభించారు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కేసీఆర్ ను పలు ప్రశ్నలు సంధించారు. 

అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తాను ఏం చెప్పాలని అనుుకున్నారో కేసీఆర్ అదే చెప్పారట. ఈ ప్రాజెక్ట్ గురించి సవివరంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడంతోపాటు ఓ నివేదికను కమీషన్ కు అందజేసారట కేసీఆర్. ఇలా దాదాపు 50 నిమిషాల పాటు కేసీఆర్ విచారణ సాగింది... అనంతరం బిఆర్కే భవన్ నుండి వెళ్లిపోయారు కేసీఆర్.