జనగామ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రసేఖర్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. పెన్షన్ల విషయంలో బిజెపి చెబుతున్న మాటలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. బిజెపి నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పింఛన్లకు కేంద్రం అధిక మొత్తంలో నిధులు ఇస్తోందని బిజెపి నేతలు చెబుతున్నారని, ఒక వేళ దాన్ని ఎవడైనా మొగోడు రుజువు చేస్తే ఒక్కటే ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతానని ఆయన అన్నారు. 

జనగామ జిల్లాలోని కొడకండ్లలో ఆయన రైతు వేదికను ప్రారంభించి, ఆ తర్వాత జరిగిన సభలో శనివారంనాడు ప్రసంగించారు. దుబ్బాక ఎన్నికల్లో బిజెపి వాళ్లు గెలిచేది లేదు, చేసేది లేదని ఆయన అన్నారు. అక్కడ టీఆర్ఎస్ బ్రహ్మాండంగా ఉందని చెప్పారు దేశాన్ని పాలిస్తున్న బిజెపి నేతలు ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నారని, మన రాష్ట్రంలో 38 లక్షల 64 వేల 751 మందికి అన్ని రకాల పింఛన్లు ఇస్తున్నామని, నెల రాగానే అందరికీ పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. 

ఆ పెన్షన్లలో ఏడు లక్షల మందికి మాత్రమే కేంద్రం ఇస్తోందని, మనిషికి 200 రూపాయలు మాత్రమే ఇస్తోందని, ఏడాదికి మొత్తం కేంద్రం ఇచ్చేది రూ.105 కోట్లు మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం 11 వేల కోట్లు ఇస్తోందని కేసీఆర్ చెప్పారు బిజెపి పచ్చి అబద్ధాలు మాట్లాడుతోందని అన్నారు. కాగ్ లెక్క తీసి అధికారికంగా విడుదల చేసిందని, తాను చెప్పే లెక్కలు కాగ్ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. ఓట్ల కోసం ఘోరమైన మోసాలు చేస్తున్నారని విమర్శించారు. 

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించారు. తెలంగాణలో రూ.350 కోట్ల వ్యయంతో 2,601 రైతు వేదికలను నిర్మిస్తున్నారు. ఇందులో 2462 గ్రామీణ ప్రాంతాల్లో, 139 పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కో రైతు వేదికను 2,046 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 1951 రైతు వేదికల నిర్మాణం పూర్తయింది. మరో 650 వేదికలు నిర్మాణ దశలో ఉన్నాయి. 

కొండకండ్లలో జరిగిన కార్యక్రమానికి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర రెడ్డి, మత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడు తదితరులు పాల్గొన్నారు. రైతు సాగు సమస్యలపై చర్చించడానికి, అధిక దిగుబడులూ సస్య రక్షణ కోసం అనుసరించాలన్సిన అధునాతన పద్ధతులపై అవగాహన పెంచుకునేందుకు రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. 

తాను బతికి ఉన్నంత వరకు రైతు బంధు ఆగదని ఆయన స్పష్టం చేశారు. కౌలు రైతులను ఈ విషయంలో తాము పట్టించుకోబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో జమీందార్లు, జాగీర్దార్లు లేరని ఆయన చెప్పారు. రైతులకు మాత్రమే తాము రైతు బంధు పథకం వర్తింపజేస్తామని చెప్పారు.