హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు సీఎం కేసీఆర్ హాజరుకాగా.. ఆ సందడి కామారెడ్డిలో ప్రతిధ్వనించింది. ఇంతకీ అది ఎవరి పెళ్లంటే.. కామారెడ్డి నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ నేత గంప గోవర్ధన్ కుమారుడిది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. అయితే ఇప్పటినుంచే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే 115 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించి పొలిటికల్ హీట్ పెంచేశారు. అయితే కేసీఆర్ ఈసారి గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు కేసీఆర్ హాజరుకాగా.. ఆ సందడి కామారెడ్డిలో ప్రతిధ్వనించింది. ఇంతకీ అది ఎవరి పెళ్లంటే.. కామారెడ్డి నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ నేత గంప గోవర్ధన్ కుమారుడిది.
కేసీఆర్ కోసం గంప గోవర్ధన్ రానున్న ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానాన్ని వదులుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం హైదరాబాద్ శివార్లలో గంప గోవర్దన్ కుమారుడి వివాహం జరగగా.. అక్కడ పూర్తిగా ఎన్నికల సందడి నెలకొంది. ఈ వివాహా వేడుకకు సీఎం కేసీఆర్ హాజరుకాగా, కామారెడ్డి నియోజకవర్గం నుంచి వందలాది మంది బీఆర్‌ఎస్ మద్దతుదారులు ఆయనకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసీఆర్ వేదిక వద్ద వెళ్లే సమయంలో పెద్ద ఎత్తన బీఆర్ఎస్ శ్రేణులు ఆయనతో చేతులు కలిపేందుకు ప్రయత్నించారు. ‘‘జై కేసీఆర్’’, ‘‘దేశ్ కా నేత కేసీఆర్’’ ‘‘కేసీఆర్ కావాలి.. కామారెడ్డికి రావాలి’’ అని నినాదాలతో హోరెత్తించారు. తమ సెల్ ఫోన్‌లతో కేసీఆర్‌ను ఫొటో తీసుకొనేందుకు, సీఎంతో కరచాలనానికి మహిళలు, యువతీ యువకులు పోటీపడ్డారు.
ఈ క్రమంలోనే కేసీఆర్ కూడా వారిని నిరుత్సాహపరచకుండా.. వారితో కరచాలనం చేశారు. తనతో ఫొటోలు తీసుకోవడానికి అనుమతించారు. ఇక, పెద్ద ఎత్తున జనాలను అదుపు చేయడంలో భద్రతా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక, కేసీఆర్ వేదిక వద్దకు చేరుకోగానే మద్దతు తెలిపేందుకు వచ్చిన శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట కూడా చోటుచేసుకుంది.
అయితే ఈ విధంగా హైదరాబాద్‌లో జరిగిన గంప గోవర్దన్ కుమారుడి పెళ్లి.. కామారెడ్డిలో ఎన్నికల సందడిని ప్రతిధ్వనించింది. ఇక, కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచే అవకాశం ఉన్న మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్.. కేసీఆర్‌ను ఢీ కొట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీ కూడా కేసీఆర్‌పై పోటీకి సీనియర్ నేతను బరిలో నిలపాలని బీజేపీ భావిస్తోంది.
