Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్: టీఆర్ఎస్ కారు గుర్తు రిడీజైన్

గత డిసెంబర్ 27న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కేసీఆర్ లేఖ అందజేశారు.ఈవీఎంలలో కారు గుర్తు స్పష్టంగా కనిపించడం లేదని తెలిపారు. దీంతోపాటు కారు గుర్తును పోలి ఉన్న ట్రక్కు, ఇస్త్రీపెట్టె, రైతు నడుపుతున్న ట్రాక్టరు, కెమెరా గుర్తులను అభ్యర్థులకు కేటాయించవద్దని కోరారు. 

KCR asks to modify TRS symbol car
Author
New Delhi, First Published Feb 9, 2019, 10:42 AM IST

హైదరాబాద్: రీడిజైన్ చేసిన కారు గుర్తును తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎన్నికల సంఘానికి సమర్పించింది. కారు గుర్తు మరింత స్పష్టంగా కనిపించే విధంగా దాన్ని రీడిజైన్ చేశారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు అయోమయానికి గురై కారుకు వేయాల్సిన ఓటును ట్రక్కు గుర్తుకు వేశారని గ్రహించి టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కారు గుర్తు డీజైనింగ్ చేసి ఈసికి సమర్పించారు.

గత డిసెంబర్ 27న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కేసీఆర్ లేఖ అందజేశారు.ఈవీఎంలలో కారు గుర్తు స్పష్టంగా కనిపించడం లేదని తెలిపారు. దీంతోపాటు కారు గుర్తును పోలి ఉన్న ట్రక్కు, ఇస్త్రీపెట్టె, రైతు నడుపుతున్న ట్రాక్టరు, కెమెరా గుర్తులను అభ్యర్థులకు కేటాయించవద్దని కోరారు. 

కేసీఆర్ విజ్ఞప్తికి స్పందించిన ఈసీ, రీడిజైన్ చేసిన కారు గుర్తును సమర్పించాలని కేసీఆర్‌కు గత నెల 7న లేఖ రాసింది. ఈ మేరకు రీడిజైన్ చేసిన కారు గుర్తును కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ద్వారా ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం సమర్పించారు. 

ఈవీఎంలలో కారు గుర్తు స్పష్టంగా కనిపించకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధులు, కంటిసమస్య ఉన్నవారు చాలా ఇబ్బంది పడ్డారని వినోద్ కుమార్ అన్నారు. సమాజ్‌వాది ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీకి కేటాయించిన ట్రక్కు గుర్తు గందరగోళానికి గురిచేసిందని చెప్పారు. దానికితోడు ఆ పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల పేర్లతో ఉన్నవారిని ఎంపికచేసి టికెట్లు ఇచ్చారని అన్నారు. 

కారు గుర్తును ట్రక్కు పోలి ఉండటం, అభ్యర్థుల పేర్లు ఒకే విధంగా ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ట్రక్కు గుర్తును ఏ పార్టీకి కేటాయించకుండా స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని ఈసీని కోరినట్టు వినోద్ తెలిపారు. 

రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనే ఈ నిర్ణయాన్ని అమలుచేయాలన్నారు. ఈ గుర్తు ద్వారా తమ పార్టీకి నష్టం జరిగిందని, పలు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓటమికి కారణమయ్యాయని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios