కన్న తండ్రి, పిన తల్లి చేతిలో చిత్రహింసలకు గురయి దాదాపు చావు అంచులదాక వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ప్రత్యూష అనే యువతి మామూలు మనిషిగా మారిన విషయం మనందరికి తెలిసిందే.  కోలుకున్నాక స్వయంగా ప్రగతిభవన్ కు పిలిపించుకుని తనతో కలిసి భోజనం చేసే అవకాశాన్ని  కల్పించడమే కాదు ఆమెను దత్తత కూడా తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. ఇలా సీఎం దత్తపుత్రికగా మారి ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్న ఆమె ఇప్పుడు ఓ ఇంటిది కాబోతోంది. 

పిన తల్లి చిత్రహింసల నుండి బయటపడ్డ తర్వాత ప్రత్యూష యోగక్షేమాలను మహిళా శిశు సంక్షేమ అధికారులు చూసుకుంటున్నారు. సీఎం ఆదేశాలతో ఐఏఎస్ అధికారి రఘునందన రావు ప్రత్యేకంగా ప్రత్యూష యోగక్షేమాలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం నర్సింగ్ ను పూర్తిచేసిన ప్రత్యూష ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తూ తన కాళ్లపై తాను నిలబడింది. 

అయితే తాజాగా ఆమె తనకు నచ్చిన వ్యక్తితో కొత్త జీవితాన్ని పంచుకోబోతోంది. ఇటీవల హైదరాబాద్‌ విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో నిరాడంబరంగా చరణ్‌రెడ్డి అనే యువకుడితో ప్రత్యూష నిశ్చితార్థం జరిగింది. ప్రత్యూష వివాహం ఈ నెల 28న రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామం లూర్దు మాత దేవాలయంలో జరగనుంది. ఉడుముల జైన్‌ మేరీ, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో ప్రత్యూష వివాహం జరగనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

పెళ్లికి స్వయంగా వస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారని ప్రత్యూష తెలిపింది. తనను ఆదుకున్న సీఎం, అధికారులు ఇప్పుడు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చిన చరణ్ ఆయన తల్లిదండ్రులకు రుణపడి వుంటానని ప్రత్యూష తెలిపింది.