తెలంగాణ అసెంబ్లీలో సిఎం కేసిఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అన్ని అంశాలపై ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అరెస్టు విషయాన్ని బిజెపి పక్ష నేత కిషన్ రెడ్డి తన ప్రసంగంలో లేవనెత్తారు. దానికి సిఎం రిప్లై ఇచ్చారు. మంద కృష్ణను అరెస్టు చేసిన మాట నిజమే అన్నారు. ఆయనను నిర్దాక్షిణ్యంగా అణిచివేసినం అని ప్రకటించారు. అణిచివేస్తం కూడా అని సిఎం ఘాటుగా పేర్కొన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న వేళ మంద కృష్ణ కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కై అరాచకం చేయాలని చూసిండని ఆరోపించారు కేసిఆర్. అందుకే మంద కృష్ణను అరెస్టు చేయాల్సి వచ్చిందన్నారు. అయినా మంద కృష్ణ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఆయనతో వర్గీకరణ చేయించడం సాధ్యం కాదన్నారు. తెలంగాణ మాదిగ బిడ్డలకు వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా తాను వచ్చే టర్మ్ లో వర్గీకరణ కోసం పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.

‘‘మాదిగ బిడ్డలు వర్గీకరణ అంశాన్ని నాకు వదిలిపెట్టండి. తెలంగాణ మాదిగల వెంట కేసిఆర్ ఉంటడు. వచ్చే టర్మ్ లో క్రియాశీలక పాత్ర పోశిస్తా. ఎవలెవలో చెబితే వాళ్ల వెంట పడి పోయి మీ భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకండి. మాదిగ యువత కు నేను అండగా ఉంటా. వర్గీకరణ సాధించే వరకు పోరాటాన్ని ఆపేది లేదు.’’ అని కేసిఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. వర్గీకరణ విషయంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ, తెలంగాణ కేబినెట్ చేయాల్సిన పని అంతా చేసేసిందన్నారు. ఇక చేయాల్సని పని కేంద్ర ప్రభుత్వమే అన్నారు.

కిషన్ రెడ్డికి రెడ్డికి నిజాయితీ ఉంటే ఢిల్లీకి పోయి కూసోవాలె అన్నారు. పార్లమెంటు మాత్రమే చేయాలన్నారు. లిప్ సింపతీ అక్కరకు రాదని కిషన్ రెడ్డికి చురకలు అంటించారు. బయట, శాసనసభలో మా ఇష్టం వచ్చినట్లు చేస్తం అంటే చేయనీయం అని హెచ్చరించారు.