మోడీ డైరెక్షన్‌లోనే కేసీఆర్ పనులు: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ

టీఆర్ఎస్, బీజేపీ రెండూ  ఒక్కటేనని  కాంగ్రెస్ పార్టీ  అగ్రనేత  రాహుల్  గాంధీ  చెప్పారు.ఎన్నికల ముందు  కేసీఆర్  డ్రామాలు  చేస్తారని ఆయన  చెప్పారు.ప్రజలంతా  అప్రమత్తంగా ఉండాలని  ఆయన  కోరారు.  

 KCR  Acting in Modi  Directions:  Rahul  Gandhi  In  Bharat Jodo  Yatra in Hyderabad

హైదరాబాద్:భారత్  జోడో  యాత్రను  ఏ  శక్తి  ఆపలేదని  కాంగ్రెస్ పార్టీ  అగ్రనేత  రాహుల్  గాంధీ  చెప్పారు.హైద్రాబాద్  నగరంలోని నెక్లెస్  రోడ్డులోని  ఇందిరాగాంధీ  విగ్రహం  వద్ద  మంగళవారంనాడు  రాత్రి నిర్వహించిన  బహిరంగ  సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్  గాంధీ  ప్రసంగించారు.ఎఐసీసీ  చీఫ్  గా  బాధ్యతలు  చేపట్టిన  తర్వాత  మల్లికార్జున ఖర్గే ఇవాళ  ఈ  యాత్రలో పాల్గొన్నారు. ఖర్గేతో  పాటు దిగ్విజయ్  సింగ్  కూడ  ఈ  యాత్రలో  పాలుపంచుకున్నారు.

ఇది యాత్ర కాదు,  ప్రజల గొంతుక  అని ఆయన  చెప్పారు. ఈ  యాత్రలో  ప్రజలంతా తనతో  కలిసి  నడుస్తున్నారని  ఆయన చెప్పారు.ఆర్ఎస్ఎస్,బీజేపీ హింస  రాజకీయాలు  చేస్తున్నాయని ఆయన  విమర్శించారు. దీనికి  వ్యతిరేకంగా తాను యాత్ర  చేస్తున్నానని  ఆయన  చెప్పారు. 

హైద్రాబాద్ లో రోడ్లు తక్కువ, గుంతలు ఎక్కువగా  ఉన్నాయని నగరంలోని  రోడ్లపై  రాహుల్  గాంధీ  విమర్శలు  గుప్పించారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు  టీఆర్ఎస్  మద్దతు  తెలిపిందని  రాహుల్  గాంధీ  గుర్తు చేశారు.తెలంగాణ  సీఎంకు ఏం  చేయాలో  ప్రధాని  మోడీ  చెబుతారన్నారు.మోడీ  డైరెక్షన్  లోనే  కేసీఆర్  పనిచేస్తున్నాడని రాహుల్ గాంధీ  విమర్శించారు. ఇవాళ  ఏం  చేయాలో,రేపు  ఏం  చేయాలో  మోడీ ఇచ్చిన  ఆదేశాలను కేసీఆర్ పాటిస్తున్నాడని  ఆయన  ఆరోపించారు.మోడీ, కేసీఆర్ మధ్య  డైరెక్ట్ లైన్ ఉందన్నారు.బీజేపీ, టీఆర్ఎస్  లు  రెండూ ఒక్కటేనని  ఆయన  చెప్పారు.ఎన్నికల ముందు కేసీఆర్  అనేక  డ్రామాలు  ఆడుతారన్నారు.ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని ఆయన  సూచించారు. కేసీఆర్  ఇక్కడ  చెప్పేదొకటి,  ఢిల్లీలో  చేసేదొకటి  ఆయన కేసీఆర్  తీరుపై  విమర్శలు గుప్పించారు. కేసీఆర్  సర్కార్  ప్రవేశపెట్టిన  ధరణి  పోర్టల్ కూడా  మోసమేనని ఆయన  చెప్పారు.

రైతులకు  వ్యతిరేకంగా  మోడీ  సర్కార్  మూడు  నల్లచట్టాలను  తీసుకువచ్చిందని  రాహుల్  గాంధీ  చెప్పారు.ఈ  చట్టాలతో రైతులకు  తీవ్ర  నష్టమన్నారు.అందుకే ఈ  చట్టాలకు  వ్యతిరేకంగా  రైతులు  పోరాటం  చేశారని  ఆయన చెప్పారు.  కేంద్ర ప్రభుత్వ  విధానాల  కారణంగా యువతకు ఉద్యోగావకాశాలు దక్కడం  లేదన్నారు.  సరైన  ఉద్యోగాలు  లేక  డెలివరీ బాయ్స్ గా  చిన్న  చిన్న  ఉద్యోగాలు చేస్తున్నారని  రాహుల్  గాంధీ ఆవేదన  వ్యక్తం  చేశారు.

ఏటా  రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన  హామీ  ఏమైందని  రాహుల్  గాంధీ మోడీని  ప్రశ్నించారు. నోట్ల రద్దు, జీఎస్టీతో  మధ్యతరగతి  ప్రజల  పొట్ట కొట్టారని రాహుల్  గాంధీ  ఆరోపించారు..ఎల్ఐసీ, ఎయిర్  పోర్టులు , ఎల్ఐసీ  వంటి ప్రభుత్వ రంగ సంస్థలను  కేంద్రం  ప్రైవేట్  పరం  చేస్తుందన్నారు.ఈ  క్రమంలోనే  శంషాబాద్  ఎయిర్  పోర్టును  కూడా  తన  మిత్రులకు మోడీ  కట్టబెడుతారని  ఆయన ఆరోపించారు.

మోడీ  మిత్రులు కోట్లాది రూపాయాల  రుణాలు పొందుతున్నారన్నారు. కానీ రైతులకు  మాత్రం  చిల్లిగవ్వ కూడా రుణంగా  ఇచ్చేందుకు  కేంద్రానికి  మనసు రావడం  లేదని  ఆయన  చెప్పారు. రుణాలు  చెల్లించని  కార్పోరేట్  సంస్థలను డిఫాల్టర్లుగా  కేంద్రం   ప్రకటించిందన్నారు.రుణాలు  చెల్లించలేదని  రైతులపై లాఠీ  చార్జీ  చేస్తున్నారని  రాహుల్ గాంధీ  మోడీపై మండిపడ్డారు.

గ్యాస్ ,పెట్రో ధరల   పెంపు  గురించి  మోడీ ఎందుకు  మాట్లాడడం  లేదని  రాహుల్  ప్రశ్నించారు. మోడీ అధికారంలోకి రాకముందు  గ్యాస్ , పెట్రోల్ ధరలు ఎంతున్నాయి,ఇప్పుడు ఎంత పెరిగాయో  రాహుల్  ఈ సందర్భంగా  గుర్తు చేశారు.హైద్రాబాద్ ఐటీ  రంగంలో  ప్రపంచంలోనే  అగ్రగామిగా  నిలిచిందన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios