Asianet News TeluguAsianet News Telugu

ఊపందుకుంటున్న వ్యక్తి పూజలు

  • కెసిఆర్ కు పాలాభిషేకాలా?
  • తమిళనాడు తరహాలో తెలంగాణా రాజకీయాలు
  • ఊపందుకుంటున్న వ్యక్తి పూజలు
kcr

తమిళనాడులో  ఎంజి రామచంద్రన్, జయలలితలకు అక్కడి ప్రజలు దైవత్వాన్ని ఆపాదించినట్లే తెలంగాణాలో కూడా కెసిఆర్ కు టిఆర్ఎస్ శ్రేణులు దైవత్వాన్ని ఆపాదిస్తున్నాయి. దాంతో వ్యక్తిపూజలో తమిళనాడుతో తెలంగాణా పోటి పడుతున్నట్లైంది. ఇదంతా చూస్తున్న సామాన్య జనాలకు తెలంగాణాలో  తెలంగాణా రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తల వ్యవహారం పిచ్చిగా తోస్తోంది. వ్యక్తి పూజలో తమిళనాడుకు తామేమీ తక్కువ కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

దేశంలోని పలువురు ముఖ్యమంత్రుల పనితీరు, రాష్ట్రాల అభివృద్ధిపై  విడిపి అసోసియేట్స్ అనే సంస్ధ నిర్వహించిన ఓ సర్వేలో తెలంగాణా ముఖ్యమంత్రికి మొదటి ర్యాంకు వచ్చిందన్నది వార్త. ఈ సర్వే వెలుగు చూసిన రెండు రోజుల నుండి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పట్ల తమ స్వామి భక్తిని ప్రదర్శించుకోవటంలో ఎవరికి వారు పోటీలు పడి మరీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.

 పోటీలు పడుతున్న వారందరూ సామాన్య కార్యకర్తలే అనుకుంటే పొరబాటే. ఈ పోటీలో ఏకంగా ఉప ముఖ్యమంత్రలే ఉన్నారంటేనే ఆశ్చర్యం కలుగుతోంది. సర్వే నివేదిక వెలుగు చూసిన దగ్గర నుండి కెసిఆర్ విగ్రహాలకు తెలంగాణా వ్యాప్తంగా పాలాభిషేకాలు జరుగుతున్నాయి.

విగ్రహాలు లేని ప్రాంతాల్లో కెసిఆర్ ఫొటోలు పెట్టి మరీ క్షీరాభిషేకాలు కానిచ్చేస్తున్నారు. మరికొందరు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆదిలాబాద్ లో కెసిఆర్ కు ఏకంగా గుడే కట్టారు. అలాగే మరికొందరు కరీంనగర్ లో ఇంకో దేవాలయం కడుతున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారో చేస్తున్న వారికే తెలియాలి.

 ఇదే విషయమై ఆరాతీస్తే కొన్ని ఆశక్తికరమైన అంశాలు వెలుగు చూసాయి. ఎప్పటి నుండో మంత్రివర్గంలో మార్పులుంటాయని కెసిఆర్ సంకేతాలు పంపుతున్నారు. మంత్రివర్గంలో చోటు కోల్పోవటం ఖాయమని అనుకుంటున్నవారు, మంత్రిపదవులు కావాలనుకుంటున్న శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులను ఆశిస్తున్న వారితో పాటు ఇతరత్రా కెసిఆర్ ప్రాపకాన్ని కావాలనుకుంటున్నవారంతా కలిసి ఇటు వంటి ఘటనలను యధాశక్తి రక్తి కట్టిస్తున్నారు. దానికి తోడు ముఖ్యమంత్రి కూడా ఇటువంటివి వద్దని ఇంత వరకూ వారించినట్లు కనబడలేదు. దాంతో మంత్రులు, నేతలు పోటి పడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios