నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధిగా బుధవారం నాడు కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. 

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా  కవితను ఆ పార్టీ బరిలోకి దింపింది. బుధవారం నాడు  ఉదయం ఆమె స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.  ఆ తర్వాత ఆమె నిజామాబాద్‌కు వెళ్లారు. 

నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చిన  కవితకు ఆ పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. 
జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు  ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు వెంట రాగా కవిత నిజామాబాద్ ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

గత ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి కవిత పోటీ  చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆమె ఈ దఫా ఇదే జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనుంది.