బీఆర్ఎస్ కు ఊపిరి పోసేందుకే కవిత అరెస్ట్ - కాంగ్రెస్
నిరాశలో ఉన్న బీఆర్ఎస్ కు ఊపిరి పోసేందుకే కవితను బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కవిత అరెస్టు అంతా ఒక డ్రామా అని అభివర్ణించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ఒక రోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది. నేటి మధ్యాహ్నం నుంచి ఆమె ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సాయంత్రం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు.
కాగా.. కవిత అరెస్ట్ పై తెలంగాణ కాంగ్రెస్ స్పందించింది. ఇది లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్, బీజేపీ కలిసి సృష్టించిన డ్రామాగా అభివర్ణించింది. ‘‘నిరాశలో ఉన్న బీఆర్ఎస్ కు ఊపిరి పోసేందుకే కవితను బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఆడిన డ్రామా ఇది. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ఈడీ హఠాత్తుగా మేల్కొని సోదాలు చేపట్టి ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఒక్కరోజు ముందు కవితను అరెస్టు చేసింది. బీఆర్ఎస్ కు అనుకూలంగా సానుభూతిని సృష్టించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారు’’ అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, చైర్మన్ జి.నిరంజన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ ప్రత్యేక బృందంలో 12 మంది అధికారులు ఉన్నారు. వీరు నాలుగు టీమ్ లుగా విడిపోయి ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆమె భర్తకు సంబంధించిన బిజినెస్ లపై కూడా ఆరా తీశారు. అనంతరం సాయంత్రం ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టు భర్త అనిల్ కు సమాచారం ఇచ్చారు.
పీఎంఎల్ఎ చట్టంలోని సెక్షన్ 3, సెక్షన్ 4 ప్రకారం కవితపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఈడీ వెల్లడించింది. ఆమెను 05.20 గంటలకు అరెస్టు చేసినట్టు పేర్కొంది. కవితను నివాసం నుంచి అదుపులోకి తీసుకున్న అధికారులు.. నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి రాత్రి 8.45 నిమిషాల విమానానికి ఢిల్లీకి తీసుకెళ్లారు.
ఈడీ అధికారులు హైదరాబాద్ కు రాకముందే అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నారని, అందుకే కవిత కోసం 8.45 గంటలకు విమాన టిక్కెట్ ను బుక్ చేశారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అరెస్టు అప్రజాస్వామికం అని, కుట్రతోనే శాసన మండలి సభ్యురాలైన కవితను అదుపులోకి తీసుకున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
కాగా.. కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె నివాసం ఎదుట పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈడీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే ఈడీ అధికారులకు అధికారులకు సీఆర్పీఎఫ్ బృందం రక్షణగా నిలిచింది..