ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపిన ఆలయాలపై దాడులు, విగ్రహ ధ్వంసం కేసుల్లాగానే హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కట్టమైసమ్మ ఆలయంలో దాడి జరిగింది. కూకట్ పల్లి పరిధిలోని మూసాపేట, సఫ్దార్‌నగర్‌లో ఉన్న కట్టమైసమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. 

దీంతో ఊరుకోకుండా విగ్రహాన్ని పెకిలించి బయటపడేశారు. ఆలయ ఆవరణలో ఉన్న నాగదేవతల ప్రతిమలను సైతం పగులగొట్టారు. ఓ కుక్కను చంపి ఆలయం ముందున్న షెడ్డు రాడ్డుకు వేలాడదీశారు. 

సోమవారం తెల్లవారుజామున ఈ దృశ్యాలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అమ్మవారి విగ్రహం, నాగదేవతల ప్రతిమలను పునఃప్రతిష్ఠించడంతో పాటు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

ఈ దారుణానికి పాల్పడ్డ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ మూసాపేట కార్పొరేటర్‌, బీజేపీ నేత కొడిచర్ల మహేందర్‌ ఆధ్వర్యంలో ఆలయం ఎదుట ఆందోళన చేపట్టారు. 

ఆలయానికి సంబంధించిన స్థలాన్ని కాజేసేందుకు కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని బీజేపీ నేతలు ఆరోపించారు. కాగా, స్థానికుల ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపామని, స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు సీఐ నర్సింగ్‌రావు తెలిపారు.