కర్ణాటక ఫలితాలు ఫెడరల్ ఫ్రంట్ ప్లాన్ ను దెబ్బ తీయవు: కేసీఆర్

Karnataka polls won’t hit Federal Front plan: KCR
Highlights

తన ప్రతిపాదిత ఫెడరల్ ఫ్రంట్ ప్రణాళికను కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు దెబ్బ తీయలేవని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) చీఫ్ కె. చంద్రశేఖర రావు ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్: తన ప్రతిపాదిత ఫెడరల్ ఫ్రంట్ ప్రణాళికను కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు దెబ్బ తీయలేవని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) చీఫ్ కె. చంద్రశేఖర రావు ధీమా వ్యక్తం చేశారు. భారత రాజకీయాల్లో తమ ఫెడరల్ ఫ్రంట్ బలమైన రాజకీయ శక్తి అవుతుందని ఆయన అన్నారు. 

తాము ఎజెండాతో ముందుకు వెళ్తామని, చిల్లర రాజకీయాలు చేయబోమని ఆయన బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలే కాదు, ఏ ఎన్నికల ఫలితాలు కూడా ఫెడరల్ ఫ్రంట్ ప్రణాళికపై ప్రభావం చూపబోవని అన్నారు. 

తాము దేశంలో గుణాత్మక, నిర్మాణాత్మక మార్పు కోసం ముందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయ పార్టీలను తాను ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నారని, తమ తమ రాష్ట్రాల్లో ఎస్పీ, బిఎస్పీ, తృణమూల్ కాంగ్రెసు వంటి పార్టీలు బలంగా ఉన్నాయని, దేశంలో గుణాత్మకమైన మార్పును తేవడానికి ఆ విధమైన శక్తులతో నిర్దిష్టమైన ఎజెండాతో కలిసి పనిచేస్తామని అన్నారు. 

తాము ఎజెండాను ప్రకటించిన తర్వాత కేసీఆర్ ఒక్కడే ఉండడని, పెద్ద ఫోర్స్‌తో పెద్ద సంఖ్యలో ఉంటామని కేసిఆర్ స్పష్టం చేశారు. డైనమిక్ ఫార్ములాతో వస్తామని చెప్పారు. దేశంలో విచిత్రమైన పరిస్థితి ఉందని కేసీఆర్ అన్నారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ లోక్‌సభలో బిల్లులు ఆమోదం పొందుతున్నా రాజ్యసభలో ఆగిపోతున్నాయని చెప్పారు. 

ఇలాంటి స్థితిలో లోక్‌సభను గౌరవించాలా, లేదంటే రాజ్యసభను గౌరవించాలా? అన్న చర్చ ఉన్నదని చెప్పారు దేశంలో గుణాత్మకమార్పుకు హైదరాబాద్ కేంద్రం కావడం గర్వకారణమని చెప్పారు. 

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కర్ణాటక ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వలేదని కేసీఆర్ స్పష్టంచేశారు. మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. మీరే మా ఫెడరల్ ఫ్రంట్‌లోకి రండి అని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీకి మమత చెప్పారని తెలిపారు. 

loader