కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలంగాణలో కర్నాటక రైతుల ప్రచారం.. ఉద్రిక్తత
Karnataka Farmers: దూకుడు మీదున్న కాంగ్రెస్ కు కర్నాటక రైతులు షాక్ ఇస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కర్నాటకలోని గుల్బర్గా జిల్లాకు చెందిన రైతులు జోగులాంబ గద్వాల్ వద్ద ఈ నిరసనలను ప్రారంభించారు. తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంతో కర్నాటక కాంగ్రెస్ విఫలమైందని ఆరోపిస్తున్నారు. ఉచిత విద్యుత్తు అంశాలను ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Telangana Assembly Elections 2023: దూకుడు మీదున్న కాంగ్రెస్ కు కర్నాటక రైతులు షాక్ ఇస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కర్నాటకలోని గుల్బర్గా జిల్లాకు చెందిన రైతులు జోగులాంబ గద్వాల్ వద్ద ఈ నిరసనలను ప్రారంభించారు. తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంతో కర్నాటక కాంగ్రెస్ విఫలమైందని ఆరోపిస్తున్నారు. ఉచిత విద్యుత్తు అంశాలను ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయకుండా ప్రజలను హెచ్చరిస్తూ కర్నాటకకు చెందిన రైతుల బృందం బుధవారం తెలంగాణలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించింది. తాము ఎదుర్కొంటున్న విద్యుత్ కొరతను ఎత్తిచూపుతూ దాదాపు 200 మందికి పైగా రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. అయితే, ఈ నిరసనలను అధికార పార్టీ డబ్బులు పంచి ఇలా చేయిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్‌కు ఓటేస్తే వ్యవసాయ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుదని హెచ్చరించారు. నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న నియోజకవర్గం కొడంగల్. ఇక్కడే కాంగ్రెస్ వ్యతిరేకంగా నిరసనలు జరగడం గమనార్హం.
ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కర్నాటకలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు పొరుగు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి రైతులు గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించారు. కర్నాటకలోని గుల్బర్గా జిల్లాకు చెందిన రైతులు జోగులాంబ గద్వాల్ వద్ద మంగళవారం నాడు నిరసన చేపట్టారు. బుధవారం కొడంగల్‌కు చేరుకున్న వారు కర్నాటకలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌కు ఓటు వేసి మోసపోవద్దని స్థానికులకు సూచించారు. ఎన్నికలకు ముందు ప్రతిరోజు 10 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందనీ, అయితే ఇప్పుడు రెండు గంటల పాటు కరెంటు ఇవ్వడం లేదన్నారు. అయితే రైతులు నిరసనకు దిగడంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ర్యాలీ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.
కర్నాటక రైతులు తమ గ్రామాలకు వెళ్లాలని కోరడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు రంగప్రవేశం చేశారు. అనంతరం రైతులు స్వగ్రామాలకు వెళ్లిపోయారు. కర్నాటకలో గత కొద్ది రోజులుగా వ్యవసాయ రంగానికి సరిపడా కరెంటు సరఫరా కాకపోవడంతో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. తక్కువ వర్షపాతం, విద్యుత్ వినియోగం పెరగడం వల్ల విద్యుత్ కొరత ఏర్పడి రైతులను ప్రభావితం చేసింది. ఇదిలావుండగా, పార్టీ అవకాశాలను దెబ్బతీసేందుకు అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కర్నాటక నుంచి కొంత మందిని లంచాలు ఇచ్చి తీసుకొచ్చిందని కాంగ్రెస్ తెలంగాణ విభాగం ఆరోపించింది. తెలంగాణలోని రైతులను మాయమాటలతో మభ్యపెట్టలేక బీఆర్‌ఎస్ పార్టీ ఇలా ప్రచారం చేసేందుకు కర్నాటక నుంచి కొంతమంది కిరాయి వ్యక్తులను తీసుకొచ్చారని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సామరామ్‌మోహన్‌రెడ్డి అన్నారు.
కేసీఆర్ కుటుంబం ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలను హైదరాబాద్‌లో నిరసనకు అనుమతించడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీ రామారావును ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా కొందరు టీడీపీ మద్దతుదారులు హైదరాబాద్‌లో నిరసన తెలపాలని కోరగా.. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని అనుమతి నిరాకరించారని ఆయన సూచించారు. “కర్ణాటకకు చెందిన పెయిడ్ బ్యాచ్ తెలంగాణలో రైతులుగా నిరసనలు చేస్తే శాంతి వర్ధిల్లుతుందా” అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలోని రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదనీ, మూడు గంటలపాటు సరఫరా చేస్తే సరిపోతుందని రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కొడంగల్‌లో కర్ణాటక రైతులు చేపట్టిన నిరసనకు ప్రాధాన్యం ఏర్పడింది.