హైదరాబాద్: కాంగ్రెస్, జెడి (ఎస్) శాసనసభ్యులు శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. మూడు బస్సుల్లో వారిని కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తరలించారు. కర్నూలు మీదుగా బస్సులు హైదరాబాద్ చేరుకున్నాయి.

హైదరాబాద్ లోని మూడు హోటళ్లలో కాంగ్రెసు ఎమ్మెల్యేలు బస చేయనున్నారు. బెంగళూరులో ఉంటే తమ పార్టీల ఎమ్మెల్యేలను బిజెపి ప్రలోభాలకు గురి చేయవచ్చునని హైదరాబాదుకు తరలించారు. 

హైదరాబాదులోని తాజ్ కృష్ణా, గోల్కొండ, నోవాటెల్ హోటళ్లలో వారికి బస ఏర్పాటు చేశారు. తాజ్ కృష్ణాలో 36 మంది ఎమ్మల్యేలకు 20 గదులు బుక్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు ఎమ్మెల్యేలకు డికె శివకుమార్ నేత్వం వహించారు.

ఎమ్మెల్యేలను ఎక్కడికి తరలిస్తున్నామనే విషయాన్ని కాంగ్రెసు, జెడిఎస్ పెద్దలు చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచారు. కొచ్చికి తరలిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ, అకస్మాత్తుగా హైదరాబాదుకు తరలించడానికి నిర్ణయం తీసుకున్నారు.