కేసిఆర్ పై ఆ అపోహ తొలగినట్లేనా: కుమారస్వామి మాట ఇదీ..

Karnataka CM says Telugu CMs had asked him to join hands with Congress
Highlights


హైదరాబాద్: బిజెపికి సాయం చేసేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను ముందుకు తెచ్చారని తెలంగాణ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శలు చేస్తూ వచ్చారు.

హైదరాబాద్: బిజెపికి సాయం చేసేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను ముందుకు తెచ్చారని తెలంగాణ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో కేసిఆర్ ఆ అపోహ నుంచి బయటపడినట్లే కనిపిస్తున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మాటలతో ఆ అపోహ నుంచి కేసిఆర్ బయటపడినట్లు కనిపిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి వెళ్లవద్దని, కాంగ్రెసు కలిసి లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తనకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్, చంద్రబాబు చెప్పారని కుమారస్వామి వెల్లడించారు. 

కుమారస్వామి మాటల వల్ల ఇద్దరు ముఖ్యమంత్రులకు కేంద్రం నుంచి ఏర్పడే చిక్కుల మాట అలా ఉంచితే, కేసిఆర్ మాత్రం తన వైఖరిని స్పష్టం చేసినట్లయింది. 

నిజానికి, బిజెపి, కాంగ్రెసేతర ఫ్రంట్ ను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని కేసిఆర్ ప్రతిపాదిస్తూ వస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీల అధినేతలతో ఆయన చర్చలు కూడా జరిపారు. అయితే, దాదాపుగా ఆ పార్టీలన్నీ బిజెపిని ఎదుర్కోవాలంటే కాంగ్రెసుతో కలిసి నడవక తప్పదనే అభిప్రాయంతోనే ఉన్నాయి. 

కాంగ్రెసు పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో వేదికను పంచుకోవడానికి ఇష్టం లేకనే కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసిఆర్ హాజరు కాలేదనే విమర్శ కూడా ఉంది. ఒక రోజు ముందు బెంగళూరు వెళ్లి కుమారస్వామిని కలిసి అభినందనలు చెప్పి వచ్చారు. 

చంద్రబాబును మాత్రం కుమారస్వామి ప్రకటన ఇబ్బందుల్లో పడేసినట్లే ఉంది. కాంగ్రెసుతో జత కట్టడానికి చంద్రబాబు సిద్ధపడ్డారని బిజెపి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అది కాస్తా ఇబ్బంది కలిగించే విషయమే. కాంగ్రెసు వ్యతిరేకతతోనే టీడీపి ఆవిర్భావం జరిగింది. అటువంటి పరిస్థితిలో కాంగ్రెసుతో చంద్రబాబు జత కట్టడమంటే టీడీపి విధానాలకు వ్యతిరేకంగా వెళ్లడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

కాంగ్రెసుతో చేతులు కలపాలని చంద్రబాబు చెప్పలేదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన చంద్రబాబు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కలిసి వేదికను పంచుకున్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీతో కరచాలనం చేశారు. కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటే ఉరేసుకుంటానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అన్నారు.

loader