జీ20 సదస్సులో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రికి అవకాశం.. వివరాలు ఇవే..
జీ20 సదస్సు కోసం భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లను చేసింది. భారతదేశ సంస్కృతి కళావైభవం ఉట్టిపడేలా చూస్తోంది.

జీ20 సదస్సు కోసం భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లను చేసింది. భారతదేశ సంస్కృతి కళావైభవం ఉట్టిపడేలా చూస్తోంది. ఈ క్రమంలోనే కరీంనగర్‌కు చెందిన కళాకారుడు ఎర్రోజు అశోక్ కూడా గొప్ప అవకాశం లభించింది. ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు హాజరవుతున్న ప్రపంచ దేశాల అతిథులు ధరించే సిల్వర్ ఫిలిగ్రి అశోక చక్ర బ్యాడ్జీని తయారు చేసే అవకాశం ఎర్రోజు అశోక్‌కు దక్కింది. ఈ సదస్సుకు హాజరయ్యే వివిధ దేశాలకు చెందిన అతిథులు.. ఎర్రోజు అశోక్ రూపొందించిన అశోక చక్ర ఆకారంలో ఉన్న వెండి బ్యాడ్జీలను ధరించనున్నారు.
ఇందుకోసం మొత్తం 200 వెండి బ్యాడ్జీలను ఇక్కడి నుంచి ఢిల్లీకి తరలించారు. అంతేకాకుండా జీ 20 సమావేశాలు జరిగే చోట కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి స్టాల్‌కు కూడా అనుమతి ఇచ్చారు.
ఇక, 17వ శతాబ్దానికి చెందిన సిల్వర్ ఫిలిగ్రీ క్రాఫ్ట్‌కు తెలంగాణ రాష్ట్రంతో దీర్ఘకాల సంబంధం ఉంది. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ 2007లో జీఐ ట్యాగ్‌ని అందుకుంది. ఇది ఈ కళను సజీవంగా ఉంచిన కళాకారుల విశేషమైన అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది. ఇక, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దక్షిణాది పర్యటన సందర్భంగా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులను బహుమతిగా ఇచ్చారు. ఆమె వస్తువులను మెచ్చుకుంది, తయారీదారు ప్రయత్నాలను ప్రశంసించింది.