కరీంనగర్: వివాహేతర సంబంధం మోజులోపడి పేగు బంధాన్ని తుంచేయాలనుకుంది ఓ కఠినాత్మురాలు. తాళికట్టిన భర్త ప్రాణాలను హరించాలని చూసింది ఆ అర్థాంగి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న కట్టుకున్నవాడిని, కన్న పిల్లలను అడ్డుతొలగించుకోవాలని దారుణానికి ఒడిగట్టింది. 

పాయసంలో విషం కలిపి హతమార్చాలని చూసింది. అయితే ఆమె ఇచ్చిన పాయసం అత్త తినకపోగా మిగిలిన వారు తిని ఆస్పత్రి పాలయ్యారు. ముక్కుపచ్చలారని కుమార్తె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. తన కుటుంబ సభ్యులు బతికే ఉన్నారని పసిగట్టిన ఆమె ఇంట్లో నుంచి పరారైంది. 

వివాహేతర సంబంధం కోసం పేగు బంధాన్ని కూడా హతమార్చాలనుకుంది. తాను జన్మ ఇచ్చిన పిల్లలపట్ల కనికరం లేకుండా చంపాలనే చూసింది. ఈ దారుణమైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విలాసాగర్ ఉమ, అంజయ్య దంపతులు. వీరికి 11ఏళ్ల బాబు, నాలుగేళ్ల పాప ఉంది. సజావుగా సాగుతున్న వీరి జీవితంలోకి మూడో వ్యక్తి వచ్చి చేరాడు. 

గత కొంతకాలంగా ఉమ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నెరపుతుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో వెళ్లిపోవాలని ప్రయత్నించింది. అందుకు తన భర్త పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించింది. 

పాయసంలో విషం కలిపింది. ఆ పాయసాన్ని భర్త, ఇద్దరు పిల్లలు, మామకు కూడా ఇచ్చింది. అయితే అత్తయ్యకు ఇవ్వగా ఆమె వద్దనడంతో అది పారేసింది. భార్య ఇచ్చిన పాయసాన్ని ఆ భర్త ఎంతో ఇష్టంగా తిన్నాడు. 

ఇకపోతే చిన్నారులు సైతం తల్లి పాయసం చేయడంతో నిమిషం ఆగకుండా ఇచ్చిన వెంటనే తినేశారు. కానీ తన భార్య తనకు విషం కలిపిన పాయం ఇచ్చిందని ఆ భర్తకు తెలియదు. మాతృమూర్తే తమ పట్ల కర్కశత్వంగా ప్రయత్నిస్తుందని ఆ చిన్నారులు కూడా ఊహించలేదు. 

తిన్న కాసేపటికే ముగ్గురు ఆపస్మారకస్థితికి చేరిపోయారు. పాయసం తిన్న నలుగురు అపస్మారక స్థితిలోకి చేరిపోవడంతో ఆ విషయం గమనించిన అంజయ్య తల్లి చుట్టుపక్కల వారికి తెలియజేసింది. వెంటనే వారిని స్థానికంగా ఉన్న సిద్ధార్థ్ ఆసస్పత్రికి తరలించారు.  

అయితే ఉమ భర్త అంజయ్య, మామ, 11ఏళ్ల కొడుకు సురక్షితంగా ప్రాణాలతో బయటపడగా కుమార్తె మన్విత పరిస్థితి విషమంగా ఉంది. అయితే పాయసంలో తాను విషం కలిపిన విషయం తెలిసిపోవడంతో ఉమా పరారైంది.  

కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఉమ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉమ చేసిన ఈ దారుణం పట్ల స్థానికులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.