కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో హల్ చల్ చేస్తున్న కరీనంగర్ ఎంపీ బండి సంజయ్, ఫోన్ కాల్ సంభాషణల ఆడియోపై  కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందించారు. తన ఫోన్ సంభాషణలను ఎడిటింగ్ చేశారంటూ ఆరోపించారు. 

అసెంబ్లీ ఎన్నికల వేళ కరీంనగర్ లో ఎంపీ బండి సంజయ్ కలెక్టర్ ల మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ రాజకీయ దుమారం లేపింది. సోషల్ మీడియాలో ఈ ఆడియో రికార్డ్ వైరల్ గా మారడంతో ఇరకాటంలో పడ్డారు కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్. 

ఎన్నికల సమయంలో  జరిగిన ఫోన్ సంభాషణలను ఎడిటింగ్ చేసి వైరల్ గా మార్చారని ఆరోపించారు. మెుత్తం 8నిమిషాల 2 సెకన్ల ఆడియోను 1నిమిషం 30 సెకన్ల పాటు ఎడిటింగ్ చేసి విడుదల చేశారని ఆరోపించారు. 

ఫోన్ కాల్ సంభాషణను ఎడిటింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకునే దానిపై న్యాయ సలహా తీసుకుంటానని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు అడిగిన వాటికి జవాబు చెప్పడం కలెక్టర్ గా తన బాధ్యత అని చెప్పుకొచ్చారు.  

ఆడియో మార్చి వైరల్ చేసిన వారిపై కేసులు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆడియో దుమారంపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న తాను సిద్ధమేనని స్పష్టం చేశారు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్. 

తాను ఎప్పుడు నిబంధనలు ఉల్లంఘించి పనిచేయలేదన్నారు. చట్టానికి లోబడే తాను పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. ఆడియో లీక్ ఎడిటింగ్ చేయడంపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. సంవత్సర కాలంలో ప్రశాంతంగా జరిగిన మొత్తం ఎన్నికల నిర్వహణపై  ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చినట్లు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. 

జిల్లా ఎన్నికల అధికారిగా అభ్యర్థులు అడిగిన వాటికి వివరణ ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం ఆడియోలో కొన్ని కొన్ని పాయింట్ లను కలిపి ఆడియో లీక్ చేశారని దాన్ని చేధిస్తామని తెలిపారు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్.