కరీంనగర్: పుట్టిన రోజే ఓ యువకుడికి చివరి రోజుగా మారింది. లాక్‌‌డౌన్‌లో మిత్రులతో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్ళిన అతడు పోలీసులు వస్తున్నారనే భయంతో పరుగెత్తి బావిలో పడి మృతిచెందాడు. ఈ విషాద సంఘటన జమ్మికుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. 

పోలీసుల వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆడెపు రాజగోపాల్ ( 23) పుట్టినరోజు సందర్భంగా ఇల్లంతకుంట మండలం మల్యాల గ్రామంలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు తాటి చెట్ల వద్దకు వెళ్లాడు. కల్లు తాగుతుండగా పోలీసులు వస్తున్నారని సమాచారం రావడంతో భయంతో పరుగెడుతూ బావిలో పడి మృతి చెందాడు. 

ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.  పుట్టినరోజు నాడే బిడ్డ మృతిచెందడంతో ఆ తల్లిదండ్రుల శోకాన్ని ఆపడం ఎవరితరం కావడంలేదు. 

ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు స్ధానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.