కామారెడ్డి ఘటన.. టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో పాటు 8 మందిపై కేసు..!

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన సంగతి తెలిసిందే. 

Kamareddy protest incident Police case on bandi sanjay

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌‌కు వ్యతిరేకంగా రైతులు వరుసగా మూడో రోజు కూడా ఆందోళనలు కొసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులకు మద్దతుగా  మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి బండి సంజయ్‌తో పాటు మరో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. 

ఇక, మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని శుక్రవారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. వారిని ఓదార్చారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలంటూ బండి సంజయ్ కలెక్టరేట్‌కు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. ఆయనతో పాటు బీజేపీ కార్యకర్తలు, రైతులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో బండి సంజయ్‌ను, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 

Also Read: కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై హైకోర్టును ఆశ్రయించిన రైతులు.. రిట్ పిటిషన్ దాఖలు..

ఈ క్రమంలోనే పోలీసులు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో ఎక్కించారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కోపోద్రిక్తులైన బీజేపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసి దాని అద్దాలు పగలగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలోనే కొందరు వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. అయితే పోలీసులు బీజేపీ శ్రేణులను పక్కకు తప్పించి.. బండి సంజయ్‌ను హైదరాబాద్‌కు తరలించారు. మాస్టర్‌ప్లాన్‌పై ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామని సంజయ్ తెలిపారు.

మరోవైపు మాస్టర్‌ ప్లాన్‌పై కామారెడ్డి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో రిట్ పిటిషన్‌ దాఖలు చేశారు. తమను సంప్రదించకుండా రీక్రియేషన్‌ జోన్‌గా ప్రకటించారని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ తమకు నష్టం చేకూర్చే విధంగా ఉందని అన్నారు. రైతులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక, కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన గురువారం ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వెంటనే మాస్టర్‌ప్లాన్‌ను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  ఈ క్రమంలోనే శుక్రవారం బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. కామారెడ్డి పట్టణంలో శుక్రవారం బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. రైతుల బంద్ పిలుపుకు మద్దతు కాంగ్రెస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios