Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై హైకోర్టును ఆశ్రయించిన రైతులు.. రిట్ పిటిషన్ దాఖలు..

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాకు వ్యతిరేకంగా మూడో రోజు కూడా రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు మాస్టర్‌ ప్లాన్‌పై కామారెడ్డి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. 

Kamareddy Farmers approach high court on master plan
Author
First Published Jan 7, 2023, 10:58 AM IST

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాకు వ్యతిరేకంగా మూడో రోజు కూడా రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు మాస్టర్‌ ప్లాన్‌పై కామారెడ్డి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో రిట్ పిటిషన్‌ దాఖలు చేశారు. తమను సంప్రదించకుండా రీక్రియేషన్‌ జోన్‌గా ప్రకటించారని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ తమకు నష్టం చేకూర్చే విధంగా ఉందని అన్నారు. రైతులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే.. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన గురువారం ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వెంటనే మాస్టర్‌ప్లాన్‌ను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  ఈ క్రమంలోనే శుక్రవారం బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. కామారెడ్డి పట్టణంలో శుక్రవారం బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. రైతుల బంద్ పిలుపుకు మద్దతు కాంగ్రెస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. 

మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, కిసాన్‌ సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డిలతో కూడిన కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం పట్టణంలోని ఇందిరాచౌక్‌ వద్ద ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

ఇక, మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని శుక్రవారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించి, ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలంటూ బండి సంజయ్ కలెక్టరేట్‌కు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. ఆయనతో పాటు బీజేపీ కార్యకర్తలు, రైతులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద సంజయ్‌ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. మరోవైపు అదనపు బలగాలతో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios