కామారెడ్డి రైతులు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. 

కామారెడ్డి రైతులు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్ వివాదంపై కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ జరిపిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం.. హైకోర్టు అనుమతి లేకుండా మాస్టర్ ప్లాన్‌పై ముందుకు వెళ్లవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు గేటు వెలుపల కొందరు కామారెడ్డి రైతులు.. ఉజ్జల్ భుయాన్, కేఏ పాల్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. 

ఇదిలా ఉంటే.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు సంబంధించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను హోల్డ్‌లో పెట్టామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని నిలిపివేశామని చెప్పింది. ఈ క్రమంలోనే స్పందించిన సీజే ధర్మాసనం.. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే పూర్తిగా ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించింది. హైకోర్టు అనుమతి లేకుండా మాస్టర్ ప్లాన్‌పై ముందుకు వెళ్లవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశానికి సంబంధించి సింగిల్ బెంచ్‌లో ఉన్న మరో పిటిషన్‌ను డివిజన్ బెంచ్‌లో ఇంప్లీడ్ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది.