అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గంగుల కమలాకర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పథకాల అమలు తీరును వివరించారు.
ప్రేమ పెళ్లి చేసుకున్నవారికి కూడా కల్యాణ లక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ వర్తిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. తెలంగాణలో కులాంతర వివాహాలకు కూడా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నామని.. చెక్‌లు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గంగుల కమలాకర్ సమాధానం ఇచ్చారు. కులాంతర వివాహాలకు ఇబ్బంది లేదు. భార్య బీసీ, భర్త ఓసీ అయినప్పటికీ చెక్‌లు ఇస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అబ్జెక్షన్ లేదని అన్నారు. ఎక్కడైనా ఇలాంటి వాటిలో ఇబ్బంది ఎదురైతే తమ దృష్టికి తీసుకురావచ్చని అన్నారు.
కొందరు పెళ్లి చేసుకున్న మూడు నాలుగు నెలల తర్వాత ఈ పథకాలను దరఖాస్తు చేస్తుకుంటున్నారని తెలిపారు. అటువంటి వారికి ఆర్డీవో, ఎమ్మార్వో తనిఖీ తర్వాత చెక్‌లు అందిస్తామన్నారు. దరఖాస్తు చేసుకన్న 15 రోజులకు చెక్కులు ఇస్తామని తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిధుల కొరత లేదని అన్నారు. గ్రామాల్లో పెళ్లిళ్లు జరిగేది సర్పంచ్‌లకు ముందుగానే తెలుస్తుందని.. పట్టణాల్లో జరిగే పెళ్లిళ్లు కౌన్సిలర్లకు తెలుస్తోందని.. వారు భాద్యత తీసుకుని లబ్దిదారులు సకాలంలో దరఖాస్తు చేసుకునేలా చూడాలని సూచించారు.
లవ్ మ్యారేజ్ చేసుకున్న వారి విషయానికి వస్తే.. తల్లికి లేదా బిడ్డకు చెక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రేమ పెళ్లి చేసుకన్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకుని కూతరు ఇంట్లో నుంచి వెళ్లిపోతే కూడా దరఖాస్తు చేసుకుంటే కల్యాణ లక్ష్మి అందుతుందన్నారు. ఈ పథకాలకు ఎక్కడ నిధుల కోరత లేదన్నారు. కరోనా కాలంలో కూడా కల్యాణలక్షి, షాదీముబారక్ ఎక్కడ ఆగలేదని తెలిపారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో బాల్య వివాహాలు అరికట్టగలిగామని చెప్పారు. ఈ విషయం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో కూడా తేలిందని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు10 లక్షల 26 వేల 396 మంది లబ్ధి పొందారని తెలిపారు.
