ఇక భారత్ జాగృతి.. బీఆర్ఎస్కు తోడుగా ప్రజల్లోకి.. యాక్షన్ ప్లాన్ సిద్దం చేసిన కవిత..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్.. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా పేరు మార్చుకుని జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఆ తరహాలోనే భారత్ జాగృతిగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు సిద్దమయ్యారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్.. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా పేరు మార్చుకుని జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఉద్యమ పార్టీగా ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిందని.. నేడు స్వదేశ స్వావలంబన కోసం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఆ తరహాలోనే భారత్ జాగృతిగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది. తెలంగాణ జాగృతి తరహాలోనే భారత్ జాగృతిని కూడా రిజిస్టర్ చేశామని కవిత చెప్పారు. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలకు భారత్ జాగృతి తన కార్యకలాపాలను విస్తరిస్తుందని తెలిపారు.
తెలంగాణలో మాత్రంగా ఇంకా తెలంగాణ జాగృతిగా పనిచేస్తుందని అన్నారు. 2005లో రాష్ట్ర సాధన ఉద్యమాల మధ్యే ఈ సంస్థను స్థాపించినట్టుగా కవిత గుర్తుచేశారు.
మంగళవారం తన నివాసంలో కవిత మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మహిళలకు అండగా నిలవడంతోపాటు ఉమ్మడి ఏపీలో విస్మరించబడిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల పునరుద్ధరణలో తెలంగాణ జాగృతి విజయం సాధించిందన్నారు. ఇదే పద్ధతిలో భారత్ జాగృతి పేరుతో ఇతర రాష్ట్రాలకు తన కార్యకలాపాలను విస్తరింపజేస్తుందని చెప్పారు.
Also Read: ఢిల్లీ వేదికగా కేసీఆర్ కీలక మంతనాలు.. బీజేపీయేతర కూటమి ఏర్పాటు దిశగా బీఆర్ఎస్ అధినేత అడుగులు..!
‘‘మేము ఆయా రాష్ట్రాల్లోని ప్రజలకు సంబంధించిన రాష్ట్ర-నిర్దిష్ట కార్యకలాపాలను చేపడతాము. తెలంగాణ జాగృతి, భారత్ జాగృతిల మధ్య సోదర సంబంధం ఉంటుంది. భారత్ జాగృతి కోసం ప్రతి రాష్ట్రానికి ఒక నిర్దిష్ట ఎజెండా ఉంటుంది. ఈ సంస్థ మహిళలకు చేరువవుతుంది. రాజకీయ, సామాజిక రంగాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి యువతను భాగస్వాములను చేస్తుంది’’ అని కవిత అన్నారు.
బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్‌ఎస్ ఎదుగుతుందని కవిత అన్నారు. త్వరలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్‌లోకి పెద్ద ఎత్తున నాయకుల చేరికలు ఉంటాయని చెప్పారు. అసాధ్యమని భావించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న టీఆర్‌ఎస్.. ఆ మాదిరిగానే బీఆర్‌ఎస్ కూడా భారత రాజకీయాల్లో గుణాత్మక మార్పును సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజల బలహీన హిందీ మాట్లాడే నైపుణ్యంపై కాకుండా.. బలహీనమైన భారతీయ రూపాయిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించి ఉంటే బాగుండేదని కవిత అన్నారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా డిస్కో డ్యాన్స్‌లు చేశామని సంజయ్ చేసిన వ్యాఖ్య చాలా శోచనీయమని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారని.. అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పారని ఆమె అన్నారు. ఇక్కడ బండి సంజయ్ తనను అవమానించారని.. ఆ విధంగానే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తారని కవిత అన్నారు.
ఇక, ఇటీవల హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి విస్తృతస్థాయి సమావేశంలో కూడా కవిత ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సాహిత్య, సాంస్కృతిక, భాషా రంగాల్లో వివక్షపై తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేసినట్టే.. దేశంలో అన్యాయాలపై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యమవుతున్న వేళ.. ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతీ రాష్ట్రానికి వెళ్లి దేశంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.