Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ వేదికగా కేసీఆర్ కీలక మంతనాలు.. బీజేపీయేతర కూటమి ఏర్పాటు దిశగా బీఆర్ఎస్ అధినేత అడుగులు..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)‌తో జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.

KCR likely to make key discussions on non-BJP alliance for 2024 poll battle
Author
First Published Dec 14, 2022, 9:48 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)‌తో జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం బీజేపీ వ్యతిరేకంగా ప్రాంతీయ, జాతీయ పార్టీలను కలుపుకుని కూటమిని ఏర్పాటు చేసే ప్రక్రియను కేసీఆర్ ప్రారంభించనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా కేసీఆర్ ఇతర పార్టీల నేతలతో, రైతు సంఘాల నాయకులతో, ఇతర వర్గాలతో చర్చలు జరపనున్నట్టుగా తెలుస్తోంది. ఓ వైపు కొన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌ను విస్తరించడంతో పాటు.. మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టగా తెలుస్తోంది.  

ఢిల్లీలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని బుధవారం మధ్యాహ్నం 12.37 గంటలకు కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ అక్కడ రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యలయం ప్రారంబోత్సవానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి‌లు కూడా హాజరవుతారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ, జాతీయ పార్టీల ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్ వారితో చర్చించనున్నారు. 

పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని రైతు సంఘాల నాయకులతో కూడా సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని చర్చించనున్నారు. అదే సమయంలో తెలంగాణలో తమ ప్రభుత్వం.. రైతుల మేలు కోసం అమలు చేస్తున్న పథకాల గురించి  వారికి వివరించనున్నారు. ప్రత్యేక రాష్ట్రానికి ముందు తెలంగాణలో రైతుల స్థితి గురించి, ప్రస్తుతం రైతుల ఏ విధంగా పురోగతి సాధించారో వారికి తెలియజేనున్నారు. బీఆర్‌ఎస్ నినాదమైన “అబ్ కీ బార్, కిసాన్ సర్కార్”‌ను వారికి వివరించనున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన వ్యుహం గురించి వారితో కేసీఆర్ చర్చించనున్నారు. 

ఇక, మరో రెండు, మూడు రోజుల వరకు ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్.. వివిధ పార్టీల నేతలు, మేధావులు, ప్రముఖులు, రైతు ప్రతినిధులతో సమావేశమై బీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో అభ్యర్థులను ఖరారు చేయడంతోపాటు, ఇతర రాష్ట్రాలకు బీఆర్‌ఎస్‌ను తీసుకెళ్లే వ్యూహంపై కూడా చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ప్రతిపక్ష నేతలు దీనిపై కసరత్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. 

ఇదిలా ఉంటే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా పొత్తు పెట్టుకోవడంపై చర్చించేందుకు ఢిల్లీలో జనవరిలో ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలను కూడా ఆహ్వానించనున్నారు. 

అయితే ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌ను విస్తరించే క్రమంలో అక్కడి పరిస్థితులను బట్టి ఆయా పార్టీలతో కలిసి ముందుకు సాగాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. బీజేపీ వ్యతిరేక పోరులో కాంగ్రెస్‌ను కేసీఆర్ కలుపుకునిపోయే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో కేసీఆర్ ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios