హైదరాబాద్: ఎమ్మెల్సీగా తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు తనయ కల్వకుంట్ల కవితకు విజయం ఖాయమని అర్థమవుతోంది. తెలంగాణ శాసన మండలి సభ్యురాలిగా ఆమె ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత పోటీ చేసుతున్నారు. 

నిజానికి గత ఏప్రిల్ 7వ తేదీన ఈ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉండింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల అది వాయిదా పడింది. అయితే, అక్టోబర్ 9వ తేదీన ఈ ఎన్నిక జరుగుతోంది. 12వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 14వ తేదీన ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. 

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు ఎక్కువ సంఖ్యలో టీఆర్ఎస్ కు చెందినవారే ఉన్నారు. దాని వల్ల కవిత విజయం ఖాయమని అంటున్నారు. ఈ స్థానం నుంచి 2016లో టీఆర్ఎస్ తరఫున భూపతి రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఆ  తర్వాత ఆయన కాంగ్రెసులో చేరారు. దాంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దాంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.

టీఆర్ఎస్ తరఫున కవిత పోటీ చేస్తుండగా, కాంగ్రెసు నుంచి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, బిజెపి నుంచి లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు.  నిజామాబాద్ స్థానిక సంస్థల ఓట్లు 824 ఉండగా, అందులో కాంగ్రెసు, బిజెపిలకు కలిపి 180 మాత్రమే ఉన్నాయి. టీఆర్ఎస్ కు 600కు పైగా ఓట్లున్నాయి. దాంతో కవిత విజయం నల్లేరు మీద నడకేనని భావిస్తున్నారు. 

కల్వకుంట్ల కవిత 2014లో నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. అయితే, గత లోకసభ ఎన్నికల్లో ఆమె బిజెపి తరఫున పోటీ చేసిన అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో ఆమె నిజామబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగారు.