ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే కవిత ప్రగతి భవన్‌కు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ అధికారులు కవిత పేరును ప్రస్తావించిన సమయంలోనే.. తాను దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తానని ఆమె ప్రకటించారు. అయితే తాజాగా సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న నేపథ్యంలో.. కవిత ఈరోజు ఉదయం తన నివాసం నుంచి ప్రగతి భవన్‌కు బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ నెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణ కోసం.. ఆమె సౌలభ్యం మేరకు హైదరాబాద్ లేదా ఢిల్లీలోని నివాస స్థలాన్ని తెలియజేయాలని కవితను సీబీఐ అధికారులు కోరారు.ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని తన నివాసంలో తనను కలుసుకోవచ్చని.. ఇంటి వద్దే వారికి వివరణ ఇస్తానని కవిత చెప్పారు. ఈ క్రమంలోనే కవిత నేడు ప్రగతి భవన్‌లో సీబీఐ నోటీసులపై తన తండ్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చించే అవకాశం ఉంది. సీబీఐ నోటీసులపై ఎలాంటి వైఖరితో ముందుకు సాగాలి, వీటిని ఏ విధంగా ఎదుర్కొవాలనే అంశంపై కవిత కుటుంబ సభ్యులతో చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే న్యాయపరమైన అంశాలపై సంబంధిత నిపుణుల నుంచి అభిప్రాయాలను తీసుకోనున్నట్టుగా సమాచారం. మరోవైపు కవితకు నోటీసులపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా మొదటి నుంచి బీజేపీ చేస్తున్న విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టానే అంశాలనే కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది.
Also Read: హైదరాబాద్‌లో కవితను సీబీఐ విచారించడం సాధ్యమేనా?.. తెరపైకి సరికొత్త చర్చ..!
ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి.. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద కవితకు సీబీఐ నోటీసులు జారీచేసింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లోని కవిత నివాస చిరునామాను సీబీఐ నోటీసులో పేర్కొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ సందర్భంగా కవితకు సంబంధం ఉన్న కొన్ని వాస్తవాలను గుర్తించామని పేర్కొంది. అందువల్ల దర్యాప్తు కోసం ఆమె నుంచి వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

రెండు రోజుల క్రితం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో తన పేరును ప్రస్తావించడంపై స్పందించిన కవిత.. ఎలాంటి విచారణను ఎదుర్కొవడానికైనా సిద్దమని చెప్పారు. మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లల్లో.. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలో వచ్చిందని విమర్శించారు. ఏ రాష్ట్రానికైనా మోదీ పోయే ముందు.. ఈడీ రావడం చూస్తూనే ఉన్నామని అన్నారు. తెలంగాణలో వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు ఉన్నాయి కనుకే.. మోదీ కన్నా ముందు ఈడీ వచ్చిందని విమర్శించారు. ఇది కామనే అని అన్నారు. తన మీద, మంత్రుల మీద, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై మీద ఈడీ కేసులు పెట్టడం బీజేపీ హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అని మండిపడ్డారు. ఇలాంటి వాటిని పట్టించుకునే అవసరం లేదని అన్నారు.
దర్యాప్తు సంస్థలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతున్నామని కవిత తెలిపారు. మీడియాలో లీక్‌లు ఇచ్చి నాయకులకు ఉన్న మంచి పేరు చెడగొడున్నారని విమర్శించారు ఇలాంటి వాటిని ప్రజలు తిప్పికొడతారని అన్నారు. ఈ పంథా మార్చుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి గెలవాలని అనుకుంటే చైతన్యవంతమైన తెలంగాణలో అది కుదరని పని అన్నారు. కేసులు పెడతాం, జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. భయపడేది లేదని అన్నారు. జైలులో పెడితే ఏమైతది అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు. ఇక, మీడియాతో మాట్లాడిన అనంతరం కవిత జగిత్యాల జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
