నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కదలికలపై ఆ పార్టీ నిజామాబాద్ పార్లమెమంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. డిఎస్ గత మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు.

డిఎస్ ఢిల్లీ పర్యటన వెనక మతలబు ఏమిటనేది కవిత ఆరా తీసినట్లు తెలుస్తోంది. డిఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆరోపిస్తున్నారు.

దాంతో కల్వకుంట్ల కవిత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో తన క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు. డిఎస్ వ్యవహారంపై ఆమె వారితో చర్చిస్తారు. డిఎస్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కూడా వారు లేఖలు రాసినట్లు తెలుస్తోంది.

కాగా, డిఎస్ కుమారుడు అరవింద్ కుమార్ ప్రస్తుతం బిజెపిలో ఉన్నారు. ఆయన బిజెపి తరఫున వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు సీటుకు పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

కాగా, పార్టీలో డిఎస్ గత కొద్ది కాలంగా అసంతృప్తితో ఉన్నట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఆయన పార్టీ మారుతారని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారాన్ని డిఎస్ అప్పట్లో ఖండించారు.